ఆసరా : కొత్త పింఛన్లు ఎప్పుడో..?
గత ఆగస్టు నెలాఖరు వరకు మీ సేవా కేంద్రాల ద్వారా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఆ తరువాత కరోనా మహ్మమారి కారణంగా అర్హులందరూ దరఖాస్తులు చేసుకోలేమని కోరగా తిరిగి అక్టోబర్ చివరివరకు గడువును పొడిగించారు. ప్రస్తుతం జాబితాను ఆన్లైన్లో పొందుపరిచినా పూర్తిస్థాయిలో పరిశీలించలేదు. గ్రామ స్థాయిలో పంచాయతీ సిబ్బంది, పట్టణ స్థాయిలో పురపాలిక గ్రామీణాభివృద్ధి, ఇతరత్రా శాఖాధికారులు పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో పరిశీలన పిమ్మట అర్హుల జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం త్వరలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఎప్పుడూ, ఎక్కడ అనే విషయాలను ప్రస్తావించకపోవడంతో దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మీ సేవా కేంద్రాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పినా అక్కడికీ వెళ్లేందుకు కొందరికీ వ్యయ ప్రయాసాలు తప్పలేదు.
ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న వారు ఇంకెప్పుడు పింఛన్ ఇస్తారని మీసేవా కేంద్రాల నిర్వాహకులను అడుగుతున్నారు. మరొకవైపు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పంచాయతీలు, పురపాలక సంస్థల కార్యాలయాలకు తరుచూ వెళ్లి ఈ విషయంపై అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజావాణిలో కొత్త ఆసరా పింఛన్లు ఇప్పించాలని కలెక్టర్లకు దరఖాస్తులు వస్తుండడం గమనార్హం. ప్రభుత్వం గత అక్టోబర్లో కొత్తగా స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరిచారు. ఉన్నతాధికారుల పరిశీలన తరువాత అర్హుల జాబితా ప్రకటించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే ఇప్పటివరకు దరఖాస్తులను పరిశీలించలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు అని అధికారులు పేర్కొంటున్నారు. కొత్గా దరఖాస్తు చేసుకున్నవారికి పింఛన్లు ఎప్పుడు వస్తాయో చూడాలి మరీ.