ఈ లక్షణాలు ఉంటే.. మీకు ఒమిక్రాన్ వచ్చినట్టే..?
కానీ.. అసలు ఒమిక్రాన్ వేరియంట్ మనకు వచ్చిందా లేదా తెలుసుకోవడం ఎలా.. అసలు ఒమిక్రాన్ వస్తే మన శరీరంలో ఏం మార్పులు జరుగుతాయి. పరీక్ష చేయించుకోకపోయినా మనకు ఒమిక్రాన్ వచ్చిందని గుర్తు పట్టడం ఎలా.. వంటి అనేక అనుమానాలు జనంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఆ సందేహాలు తీరుస్తుంది. ఒమిక్రాన్ వైరస్ వస్తే వచ్చే ప్రధాన లక్షణాలు ఏంటో ఓసారి చూద్దాం.
అదేంటి.. ఒమిక్రాన్ కూడా కరోనా వేరియంటే కదా.. మళ్లీ కరోనాకు .. ఒమిక్రాన్‌కు లక్షణాల్లో తేడాలు ఉంటాయా అన్న అనుమానం రావడం సహజమే. కానీ వైరస్ అప్‌డేట్ అయ్యింది కాబట్టి లక్షణాలు కూడా అప్‌డేట్ అవుతాయన్నమాట. కొన్ని లక్షణాలు పోతాయి.. కొత్తగా మరికొన్ని లక్షణాలు చేరతాయి. ఒమిక్రాన్ వస్తే.. మనిషికి విపరీతమైన అలసట కనిపిస్తుంది. అలాగే వళ్లు నొప్పులు కూడా బాగా వస్తాయి.
ముక్కు కారుతుంటుంది.. దగ్గు, గొంతులో గరగర స్వల్పంగా ఉంటాయి. తలనొప్పి, స్వల్పంగా జర్వం ఉండొచ్చు.. అయితే ఈ లక్షణాలన్నీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ లక్షణాలు ఉంటే.. దాదాపు ఒమిక్రాన్ వచ్చినట్టు భావించొచ్చు. అయితే కరోనా తరహాలో వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం మాత్రం ఒమిక్రాన్‌లో ఉండవు. కరోనాలో ఉన్న అధిక జ్వరం కూడా ఒమిక్రాన్‌లో ఉండదు. ఈ లక్షణాలతో మీకు ఒమిక్రాన్ సోకినట్టు అనుమానం ఉంటే పరీక్ష చేయించుకోవచ్చు.