ఆ సీట్లలో జనసేన దూకుడు..కైవసం అవుతాయా?
బాబు పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నా సరే...పవన్ కల్యాణ్ రెడీగా లేరని అర్ధమవుతుంది. అయితే తమతో పొత్తు పెట్టుకోవాలంటే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని చెప్పి జనసేన నేతలు బేరాలు ఆడేస్తున్నారు. అయితే చంద్రబాబు సీఎం సీటు వదులుకోవడం జరిగే పని కాదు. ఇలా పొత్తుల గురించి మాట్లాడుతూనే కొందరు నేతలు నియోజకవర్గాల్లో దూకుడుగా పనిచేస్తున్నారు.
బలం ఉన్న నియోజకవర్గాల్లో సత్తా చాటాడానికి రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు బాగానే ఓట్లు పడ్డాయి. అలాంటి నియోజకవర్గాలపై ఇప్పుడు ఫోకస్ చేసి జనసేన నేతలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో రాజోలు సీటుని జనసేన గెలుచుకున్న విషయం తెలిసిందే. కానీ జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ వైపు వెళ్ళిపోయారు. అయినా సరే రాజోలులో జనసేన స్ట్రాంగ్‌గా ఉంది. అక్కడ సత్తా చాటాలని గట్టిగా ట్రై చేస్తున్నారు.
ఇక భీమవరం, నరసాపురం తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో సైతం జనసేనకు బాగా ఓట్లు పడ్డాయి. భీమవరం, నరసాపురం స్థానాల్లో అయితే జనసేనకు రెండో స్థానం వచ్చింది. కాబట్టి ఈ సీట్లలో ఈ సారి సత్తా చాటాలని జనసేన నేతలు చూస్తున్నారు. అటు అమలాపురం, కాకినాడ సిటీ, రూరల్, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు లాంటి నియోజకవర్గాలపై కూడా జనసేన ఫోకస్ పెట్టింది. ఇక విశాఖలో నగరంలో ఉన్న నియోజకవర్గాలు, గాజువాక, భీమిలి స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ స్థానాల్లో ఎలాగైనా సత్తా చాటాలని చెప్పి జనసేన చూస్తుంది.