కొత్త జిల్లాలతో తెలంగాణ ఏం సాధించింది..? ఏపీ ఏం సాధించబోతోంది..??

Deekshitha Reddy
కొత్త జిల్లాలు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఓవైపు ఉద్యోగులు పీఆర్సీ కోసం గొడవ చేస్తున్న టైమ్ లో జిల్లాల విభజన అనే అంశాన్ని అనుకోకుండా తెరపైకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇటీవలే కేబినెట్ భేటీ జరిగినా.. ఆ తర్వాత హడావిడిగా ఈ అంశంపై ఆన్ లైన్ మీటింగ్ పెట్టి తెరపైకి తెచ్చారు. పీఆర్సీ గొడవని పక్కనపడేసేందుకే దీన్ని తలకెత్తుకున్నారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు 13 జిల్లాలకు 3 రాజధానులు 12 ఎయిర్ పోర్ట్ లు, 26 జిల్లాలకు 6 రాజధానులు 26 ఎయిర్ పోర్ట్ లు అనే జోకులు కూడా సోషల్ మీడియాలో బాగా పేలుతున్నాయి. ఇంతకీ కొత్త జిల్లాలతో ఏపీలో అభివృద్ధి ఉరకలెత్తుతుందా..? అసలేం జరుగుతుంది..?
తెలంగాణలో కూడా ఇలాగే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల కొత్త రాష్ట్రంగా చేశారు, ఆ తర్వాత వాటి సంఖ్యను 33కి చేర్చారు. ఇలా కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల తెలంగాణ అభివృద్ధిలో ఏమైనా మార్పులొచ్చాయా..? ఈప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. తెలంగాణలో జిల్లాల విభజన ఫలితాలు ఇంకా ప్రజలకు అందలేదు. జిల్లాలను విభజించడం వల్ల నేరుగా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగింది అంటే ఇప్పటికీ అది ప్రశ్నగానే మిగిలిపోతుంది. భవిష్యత్తులో ఏవైనా ఫలితాలు వస్తాయో లేదో చూడాలి.
ఏపీలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు విభజిస్తున్నామని చెబుతున్నారు. జిల్లాలు మాత్రమే కొత్తగా ఏర్పడతాయి, మండలాలలో అసలు మార్పు లేదు, రెవెన్యూ డివిజన్లలో స్వల్పంగా మార్పు ఉంటుంది. ఈ మార్పుతో పాలనా సౌలభ్యం ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలన ప్రజల దగ్గరకు చేరింది. ప్రతి చిన్న పనికీ మండల కేంద్రానికి లేదా, జిల్లా కేంద్రానికి వెళ్లే శ్రమ ప్రజలకు తప్పిపోయింది. గ్రామ సచివాలయాల్లోనే అన్ని సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ దశలో జిల్లా కేంద్రాలను కూడా ప్రజలకు మరింత చేరువ చేస్తామని, అందుకే జిల్లాలు విభజిస్తున్నామని చెబుతున్నారు నేతలు.
తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత కొత్త కలెక్టరేట్ లు, కొత్త ఎస్పీ ఆఫీస్ లు సహా ఇతర కార్యాలయాలన్నీ ఆయా కేంద్రాల్లో ఏర్పాటయ్యాయి. ఆ స్థాయిలో కొత్త ఉద్యోగాల కల్పన మాత్రం సాధ్యం కాలేదు. ఇటు ఏపీలో కూడా కార్యాలయాలు కొత్తవి ఏర్పడితే సరిపోతుందా లేక కొత్త ఉద్యోగాల కల్పన ఉంటుందా అనేది వేచి చూడాలి. ఉపాధి అవకాశాలు పెరిగి, నిజంగానే పాలన ప్రజలకు చేరువ అయితే జిల్లాల విభజనకు సార్థకత చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: