అమరావతి : ఎన్టీయార్ కుటుంబసభ్యుల మౌనవ్రతం ?
జిల్లాల పునర్విభజనలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఇతర జిల్లాల్లాగే కృష్ణాజిల్లా కూడా రెండుగా విడిపోయింది. ఇందులో విజయవాడ కేంద్రంగా ఏర్పడబోతున్న కొత్తజిల్లాను ప్రభుత్వం ఎన్టీయార్ జిల్లాగా ప్రకటించింది. కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడతానని పాదయాత్ర సందర్భంగా 2018లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటన ఇపుడు కార్యరూపం దాల్చింది. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఎన్టీయార్ అభిమానులంతా హ్యపీగా ఫీలవుతున్నారు. కానీ ఎన్టీయార్ కుటుంబసభ్యులే బాధపడుతున్నట్లుంది.
ఎన్టీయార్ పేరు పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించగానే ఎన్టీయార్ అభిమానులు, ఎన్టీయార్ సొంతూరైన నిమ్మకూరు, మండలం, నియోజకవర్గమైన గుడివాడ వాసులు, నందమూరి ఇంటిపేరున్న వాళ్ళు కూడా తమ సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు జగన్ కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. మరి బయటవాళ్ళంతా ఇంత హ్యాపీగా ఉంటే ఎన్టీయార్ సొంతకుటుంబం మాత్రం మౌనవ్రతం పాటిస్తోంది. జిల్లాల సంఖ్యను పెంచటంపై హర్షం వ్యక్తంచేసిన బాలకృష్ణ జిల్లాకు తమ తండ్రి పేరుపెట్టడంపై ఏమీ మాట్లాడలేదు.
ఇక్కడే అందరికీ అనుమానం వస్తోంది. ఎన్టీయార్ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు చాలామందే ఉన్నారు. వీరందరిలోకి పురందేశ్వరి, నందమూరి రామకృష్ణ మాత్రమే ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. మరి మిగిలిన వాళ్ళు ఎందుకుని ఇప్పటివరకు నోరిప్పలేదు ? తమ తండ్రి లేదా మామగారి లేదా తాతగారి పేరును ఒక జిల్లాకు పెట్టినందుకు వాళ్ళు ప్రభుత్వానికి (జగన్ కు కాదు) ధన్యవాదాలు కూడా చెప్పలేదే ?
వీళ్ళ వరస చూస్తుంటే జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టడం ఇష్టం లేదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేదా జగన్ ప్రభుత్వం ఎన్టీయార్ పేరును జిల్లాకు పెట్టడాన్ని భరించలేకపోతున్నారా ? ఏదేమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అమల్లోకి తెచ్చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని జిల్లా వాసులు, అభిమానులంతా బహిరంగంగా స్వాగతిస్తున్నారు. మరి కుటుంబసభ్యులకు మాత్రం ఏమైంది ? మొహమాటానికి కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలో లేదా కృతజ్ఞతలో కూడా చెప్పటానికి నోరు రావటంలేదంటేనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.