కొత్త జిల్లాల కుమ్ములాట.. సైలెంట్ గా జగన్ ని దెబ్బకొట్టిన బాబు..

Deekshitha Reddy
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాలకోసం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇప్పటి వరకూ టీడీపీ గట్టిగా స్పందించిన దాఖలాలు లేవు. చంద్రబాబు మాత్రం సహేతుకంగా విభజన జరగలేదని అన్నారు. కనీసం ఎన్టీఆర్ జిల్లాపై కూడా ఆయన స్పందించలేదు. బాలకృష్ణ కూడా హిందూపురం జిల్లా కేంద్రం వరకే పరిమితం అయ్యారు.

వాస్తవానికి టీడీపీనుంచి అంతకు మించిన స్పందన ఆశించింది వైసీపీ ప్రభుత్వం. కొత్త జిల్లాల ఏర్పాటుపై టీడీపీ నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వస్తాయని, దీంతో ఇదో కొత్త చర్చకు తావిస్తుందని భావించారు. ఇప్పటికే ఏపీలో పీఆర్సీ గొడవ జరుగుతోంది. కొత్త జిల్లాల వ్యవహారం తెరపైకి వస్తే దానికి ప్రాధాన్యం కాస్త తగ్గుతుందని అనుకున్నారంతా, చివరకు అదే జరిగింది. కొత్త జిల్లాలపై మీడియాలో జరుగుతున్న హడావిడితో ఉద్యోగుల ఆందోళనపై ఫోకస్ కాస్త తగ్గినట్టయింది. కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఈ విషయంలో కాస్త సంయమనం పాటించింది.

టీడీపీ సైలెంట్ కావడంతో అనుకోకుండా అధికార పార్టీలోనే గొడవలు మొదలయ్యాయి. రాజంపేట జిల్లా విషయంలో అధికార పార్టీ నేతలే నిరసనలు మొదలు పెట్టడం విశేషం. అటు మిగతా జిల్లాల వ్యవహారంలో కూడా అధికార పార్టీ నేతలనుంచే ఒత్తిడులు ఎక్కువవుతున్నాయి. దీంతో జగన్ ఆలోచించింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి అన్నట్టుగా ఉంది.

కొత్త జిల్లాల విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలని భావించింది వైసీపీ. అలా చేస్తే దానికి ఎక్కువ ప్రచారం లభిస్తుందని, ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత తమదేనని చెప్పుకోవచ్చని, అలా కూడా చంద్రబాబుని ఇరుకున పెట్టొచ్చని భావించారు వైసీపీ నేతలు. కానీ అది జరగలేదు. ప్రతిపక్ష టీడీపీ మరీ ఎక్కువగా స్పందించలేదు. వైసీపీలోనే జిల్లాల గొడవలు మొదలయ్యే వరకు వేచి చూసింది. ఈ విషయంలో చంద్రబాబు మౌనమే ఎక్కువ ప్రభావం చూపిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: