కొడాలి నానికి ఊరట.. క్యాసినోపై టీడీపీ గప్ చుప్..

Deekshitha Reddy
ప్రస్తుతం ఏపీలో రెండే రెండు హాట్ టాపిక్స్ గా ఉన్నాయి. ఒకటి పీఆర్సీ కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటం అయితే రెండోది గుడివాడ క్యాసినోపై విచారణ జరగాలంటూ టీడీపీ నేతలు పడుతున్న ఆరాటం. అయితే ఈ రెండు విషయాల్లో ఇప్పుడు క్యాసినో వ్యవహారం కాస్త చప్పబడింది. ఏకంగా గవర్నర్ కి సైతం ఫిర్యాదులందిన తర్వాత దీన్ని మించే మరో సంచలన విషయం బయటపడటంతో వైసీపీ దాన్ని హైలెట్ చేస్తోంది. క్యాసినో రచ్చను పక్కకు నెట్టేసింది. విజయవాడలోని కుమ్మరిపాలెంలో ఓ అపార్ట్ మెంట్ పైనుంచి బాలిక కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దీనికి కారణం అయిన వినోద్ జైన్ అనే వ్యక్తి ఇప్పుడు పొలిటికల్ గా టార్గెట్ అవుతున్నారు. అతను గతంలో బీజేపీలో ఉన్నాడని, ఆ తర్వాత టీడీపీలో చేరి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారనే సమాచారమైతే ఉంది. ఆ ఉదాహరణలతోనే ఇప్పుడు టీడీపీ, వైసీపీ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి, విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.

ఎవరీ వినోద్ జైన్..
2014లో వినోద్ జైన్ విజయవాడ కార్పొరేషన్ కి సంబంధించి బీజేపీనుంచి టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ టైమ్ లో వినోద్ జైన్.. అప్పటి బీజేపీ నేత, ఇప్పటి వైసీపీ మంత్రి వెల్లంపల్లితో దిగిన ఫొటోలున్నాయి. ఆ తర్వాత టీడీపీలో చేరినప్పుడు చంద్రబాబుతో కూడా ఫొటోలు దిగారు వినోద్ జైన్. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

వినోద్ జైన్ వ్యవహారం బయటపడిన తర్వాత టీడీపీ అతిడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కానీ వైసీపీ మాత్రం వినోద్ జైన్ టీడీపీ వ్యక్తి అని, చంద్రబాబు ఇప్పుడేమంటారని ప్రశ్నిస్తున్నారు. అటు టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. గతంలో వినోద్ జైన్ మంత్రి వెల్లంపల్లితో ఉన్న ఫొటోలను తెరపైకి తెచ్చి.. అతనికి వైసీపీ మంత్రికి సంబంధం ఉందంటూ విమర్శలు గుప్పిస్తోంది.

ఈ విమర్శల మధ్య గుడివాడ క్యాసినో వ్యవహారం పూర్తిగా పక్కనపడిపోయింది. దాదాపుగా ఒకరోజంతా వైసీపీ, టీడీపీ.. వినోద్ జైన్ వ్యవహారంతోనే విమర్శలతో గడిపాయి. దీంతో గుడివాడ క్యాసినో వ్యవహారంపై చర్చ ఆగిపోయింది. ఒకరకంగా ఇది మంత్రి కొడాలి నానికి ఊరటనిచ్చే అంశమేనని చెప్పాలి. మరో మంత్రి వెల్లంపల్లి ఇప్పుడు టీడీపీకి టార్గెట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: