ఈ రోజు
పార్లమెంట్ లో ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన10వ బడ్జెట్ ఇది. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక
సర్వే రిపోర్ట్ సందర్భంగా రాబోయే సంవత్సరానికి జాతీయ స్థూల ఆదాయం వృద్ధిరేటు 8 శాతం నుంచి 8.5 శాతం వరకు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కొనుగోలు
శక్తి పడిపోతున్న తరుణంలో ఆర్థికాభివృద్ధి తిరిగి పుంజుకొనగలదా అనేది ఒక ప్రశ్న? 2010
ఫిబ్రవరి 26న నాటి ఆర్థిక
మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్టు
కేంద్ర బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే కావు, అది ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించేది కూడా.
ఏడాది కాలం పాటు పోరాటాన్ని కొనసాగించి రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు అయ్యేలా ప్రభుత్వం మెడలు వంచిన
చరిత్ర భారతదేశ రైతాంగానికి ఉంది.అయితే వారి కీలక డిమాండ్ అయిన గిట్టుబాటు ధర పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రతిపాదన ఇంకా రాలేదు. ఈ బడ్జెట్లో దానిపై ప్రభుత్వం స్పందిస్తుందా? మధ్యతరగతి ఉద్యోగులు వ్యక్తిగత ఆదాయ పన్నులో రాయితీలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు.
జీవిత భీమా వంటి రంగాలకు ఆదాయపన్ను లో ప్రత్యేక రాయితీ ఉండాలని, ఇతర పొదుపులతో దాన్ని కలుపరాదనే డిమాండ్ కూడా ఉంది .
బిజెపి ప్రభుత్వం 2014లో వ్యక్తిగత ఆస్తి పన్ను ఎత్తేశారు. 2019లో
కార్పొరేట్ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. దీనివలన కార్పొరేట్లకు మంచి లాభం చేకూరింది. అయితే
కార్పొరేట్ పన్నును కోల్పోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఆమేర పరోక్ష పన్నుల ద్వారా దాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే పరోక్ష పన్నుల భారం సాధారణ ప్రజానీకం పై పడుతుంది. దానివల్ల వారి కొనుగోలు
శక్తి తగ్గుతుంది. గ్రామీణ ఉపాధి పథకాన్ని మరింత పటిష్టవంతం చేయడంతో పాటు పట్టణ ఉపాధి గ్యారెంటీ పథకాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ వస్తోంది. అలాగే విద్య,వైద్యం
కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వీటిపైన ఖర్చులు పెరిగి,మధ్య తరగతి సామాన్య ప్రజానీకం పైన భారంగా మారుతున్నాయి.
అందువల్ల విద్య,వైద్యం పై ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించి ప్రజానీకానికి ఈ సౌకర్యాలు చౌకగా అందుబాటులోకి తీసుకురావాలి. ఆదాయాలు తగ్గి,పరోక్ష పన్నులు పెరిగి,నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వీటన్నిటినీ అనుభవిస్తున్న సాధారణ ప్రజానీకం బడ్జెట్ నుండి ఏం కోరుకుంటారు? ఉద్యోగాల కల్పన కావాలని, కనీస వేతనాలు చెల్లించాలని, ధరలను అదుపు చేయాలని, విద్య,వైద్యం తమకు అందుబాటులోకి రావాలని కోరుకుంటారు.మరి కార్పొరేట్ల కొమ్ముకాసే ఈ ప్రభుత్వం, ప్రజల మొరను ఎంతవరకు ఆలకిస్తుందో చూడాలి. ప్రజానీకం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్లో తమ వాటా పెరగాలని కోరుకుంటాయి. అయితే ఈరోజు బడ్జెట్ ప్రజల ఆశలను ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి.