హైదరాబాద్‌లోనే తిరుపతి, శ్రీరంగం వంటి 108 దివ్యధామాలు..?

Chakravarthi Kalyan
దినదినప్రవర్థమానమవుతున్న హైదరాబాద్‌ చరిత్రలో ఇవాళ మరో కీలకమైన రోజు వచ్చేసింది. చరిత్రలో ఓ ప్రత్యేకమైన రోజుగా నమోదు కాబోతోంది. నేటి నుంచి హైదరాబాద్ శివార్లలోని  ముచ్చింతల్ లో శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 14 వరకు 12 రోజులపాటు ఈ వేడుకలు జరుగుతాయి. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహం పేరుతో ఉత్సవాలు జరుగుతున్నాయి.


ఇక్కడ శ్రీరామానుజాచార్యుల అత్యంత ఎత్తైన విగ్రహం కొలువు దీరిన సంగతి తెలిసిందే. మరి ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దామా..? సమతామూర్తి బంగారు విగ్రహానికి నిత్యపూజలు, అభిషేకాలు జరుగుతాయి. సమతామూర్తి బంగారు విగ్రహంపై పంచవర్ణాల విద్యుత్ దీపాలను  అమర్చారు. భద్రవేది రెండో అంతస్తులో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. రాజస్థాన్ లో దొరికే సాండ్ స్టోన్ తో రెండో అంతస్తు నిర్మాణం జరిగింది. భద్రవేదికపై వెళ్లేందుకు 108 ఉజ్జీవ సోపానాలు అంటే మెట్లు ఉంటాయన్నమాట.


సమతామూర్తి విగ్రహానికి ఎదురుగా అష్టాదళ పద్మాకృతిలో మ్యూజికల్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. 108 అడుగుల వృత్తాకారంలో అష్టదళ పద్మాకృతిలో ఈ మ్యూజికల్ ఫౌంటేన్ ఉంటుంది. మ్యూజికల్ ఫౌంటేన్ పై 8 రకాల జీవరాశులను తీర్చిదిద్దారు. పాము, చేప, మొసలి, గుర్రం, గద్ద, నెమలి, దేవత, మనిషి ఏర్పాటు చేసారు. 8 సింహాలు, 8 ఏనుగులు, 8 హంసలతో మ్యూజికల్ ఫౌంటేన్ నిర్మాణం జరిగింది. మ్యూజికల్ ఫౌంటేన్ స్థూపం ఎత్తు 36 అడుగులుగా ఉంది.


మ్యూజికల్ ఫౌంటేన్ స్థూపంపై 6 అడుగుల రామానుజచార్యుల విగ్రహం ఏర్పాటు చేశారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 దివ్యదేశాలు అంటే వైష్ణవ ఆలయాలు నిర్మించారు. 1000 మంది శిల్పులు 14 నెలలు శ్రమించి దివ్యదేశాలను నిర్మించారు. దివ్యదేశాల నిర్మాణంలో కారైకుడి, శ్రీరంగం, మహాబలిపురం, తిరుపతి, ఆళ్లగడ్డ, పురుషోత్తంపట్నం చెందిన శిల్పులు పాల్గొన్నారు.  ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి కాకతీయ నిర్మాణ శైలిలో నాలుగు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: