చెన్నై : ఆంధ్రాను నమ్మకుంటే ముణగటం ఖాయమేనా ?
దేశరాజకీయాల్లో మిగిలిన రాష్ట్రాలు ఒకలాగ ఏపీ ఒక్కటి ఒకలాగ ఉంటుంది. తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయంటే ప్రతి రాష్ట్రము పోరాటం చేయటానికి రెడీ అయిపోతుంది. కానీ ఏపీలో మాత్రం అలాంటిదేమీ ఉండదు. చాలా రాష్ట్రాల్లో ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్నాటకలో అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాటాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఆంధ్రలో మాత్రం అధికార-ప్రతిపక్ష పార్టీలు ఒకదాన్ని దెబ్బ కొట్టేందుకు మరోటి కాచుక్కూర్చునుంటుంది.
ఇపుడిదంతా ఎందుకంటే అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్యలో చేరాలంటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దేశంలోని 37 పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. స్టాలిన్ ఏమీ ఎన్డీయేయేతర, యూపీయేయేతర పార్టీలు ఏకం కావాలని పిలుపివ్వలేదు. జస్ట్ సామాజిక న్యాయ సమాఖ్యలో చేరండని మాత్రమే ఆహ్వానంపలికారు. దేశంలోని చాలా పార్టీలకు లేఖలు రాసినా స్టాలిన్ చెబుతున్న సమాఖ్యలో ఎంతమంది చేరుతారో చెప్పలేం. కానీ ఏపి నుండి మాత్రం కచ్చితంగా ఎవరు చేరరని మాత్రం చెప్పవచ్చు.
ఎందుకంటే స్టాలిన్ చెప్పిన సామాజిక న్యాయ సమాఖ్య అన్నది నరేంద్రమోడికి వ్యతిరేకంగానే ఉండబోతోందని మాత్రం అర్ధమవుతోంది. మరి మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబోయే సమాఖ్యలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఎలా ఉంటారు ? స్టాలిన్ నుండి లేఖలు అందుకున్న వారిలో జగన్, చంద్రబాబు, పవన్ కూడా ఉన్నారులేండి. మనవాళ్ళు ముగ్గురు ఎవరికి వారుగా మోడి ప్రాపకం కోసం పోటీలు పడుతున్న విషయం అందరు చూస్తున్నదే. కాబట్టి వీళ్ళ ముగ్గురిలో ఎవరు కూడా కలలో కూడా మోడి వ్యతిరేకులతో చేతులు కలిపే అవకాశమే లేదు.
అయినా ఏపిలో ఏమి జరుగుతోందో స్టాలిన్ కు తెలీకుండానే ఉంటుందా ? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్ కు దేశరాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జాతీయస్ధాయిలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్న సమాఖ్యలో చేరమని పవన్ కు కూడా లేఖ అందటమే. అంటే పవన్ను కూడా జాతీయస్ధాయిలో పెద్ద లీడర్ అని స్టాలిన్ గుర్తించటమే ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్.