మమత బాటలో స్టాలిన్.. గవర్నర్ తో యుద్ధం..
తమిళనాడులో కూడా సీఎం స్టాలిన్, గవర్నర్ రవీంద్ర నారాయణ రవి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఆమధ్య యూనివర్శిటీల ఛాన్స్ లర్ గా గవర్నర్ కి ఉన్న హోదాని తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసింది. యూనివర్శిటీలకు వైస్ ఛాన్స్ లర్లు ఉంటారు, వారందరిపై ఛాన్స్ లర్ గా గవర్నర్ కి హోదా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేయడం సంచలనంగా మారింది.
నీట్ గొడవ..
ప్రస్తుతం తమిళనాడు లో నీట్ గొడవ జరుగుతోంది. వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్ష నుంచి మినహాయింపు కావాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం బిల్లు సిద్ధం చేసింది. దీన్ని గవర్నర్ రవి వెనక్కి తిప్పి పంపించారు. గవర్నర్ చర్యపై తమిళనాడులోని అన్ని పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. నీట్ రద్దు చేయాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే రెండూ పోరాడుతున్నాయి. డీఎంకే ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి నీట్ రద్దుకి సిఫారసు చేస్తూ బిల్లు సిద్ధం చేసింది. సెప్టెంబర్ 13న దీన్ని అసెంబ్లీలో ఆమోదించి, గవర్నర్ ఆమోద ముద్రకోసం పంపించారు. తాజాగా.. ఈ బిల్లును గవర్నర్ తిప్పి పంపించారు. ఈ బిల్లుని తిరిగి పరిశీలించాలని అసెంబ్లీని కోరింది గవర్నర్ కార్యాలయం. అయితే నీట్ రద్దు చేయాల్సిందేనంటూ ప్రభుత్వం, ప్రతిపక్ష అన్నాడీఎంకే డిమాండ్ చేస్తున్నాయి. మొత్తమ్మీద గవర్నర్ పై సీఎం స్టాలిన్ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇప్పటికే ఛాన్స్ లర్ హోదా విషయంలో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది, నీట్ తో అది పెరిగి పెద్దదయ్యేలా కనిపిస్తోంది.