సజ్జల బృందానికి షాక్.. ఏపీ ఉద్యోగులు ఎంత తెలివైనోళ్లంటే..

Deekshitha Reddy
చలో విజయవాడకు ముందు ఏపీలో పరిణామాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరు. చలో విజయవాడకోసం ఉద్యోగుల తెగింపు చూసి ఒకరకంగా ప్రభుత్వం వెనకడుగు వేసిందనే చెప్పాలి. అందుకే హడావిడిగా మంత్రుల ప్రకటనలు ఆ తర్వాత మంత్రులతో చర్చలు మొదలయ్యాయి. అర్థరాత్రి వరకు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి సానుకూలంగా ముగించిన సజ్జల బృందానికి ఉద్యోగులు మాత్రం షాక్ ఇచ్చారు. ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని చెప్పారు. లిఖిత పూర్వక హామీ వచ్చే వరకు తగ్గేది లేదన్నారు.

గతంలో చాలా సార్లు సజ్జలతోనూ, సజ్జల ఉన్న కమిటీలతోనూ ఉద్యోగులు చర్చలు జరిపారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా ఆయనత చర్చలు జరుపుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. అప్పుడు ఉద్యోగుల డిమాండ్లను పూర్తిగా లైట్ తీసుకున్నారు సజ్జల. ఇప్పుడు మాత్రం వారి డిమాండ్లను ఒప్పుకునే తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో పీఆర్సీ నివేదిక ఇస్తే ఏం చేసుకుంటారంటూ ప్రశ్నించారు సజ్జల. కానీ ఇప్పుడా నివేదికను ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

అలర్ట్ గా ఉన్న ఉద్యోగులు..
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నది ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీ. వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఆ విషయంలో ఉద్యోగులు సాధించిందేమీ లేదు. దీంతో ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వంపై పూర్తి స్థాయి నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ అపనమ్మకంతోనే చర్చలకు వెళ్తున్నారు, అందుకే లిఖిత పూర్వక హామీలు కావాలంటున్నారు. సీపీఎస్ రద్దు చేస్తాం అని చెప్పగానే వెళ్లిపోరు, ఎప్పటిలోగా చేస్తారనేది వారికి లిఖిత పూర్వకంగా కావాలి. హెచ్ఆర్ఏ శ్లాబుల్లో మార్పులు చేస్తామంటే వినేలా లేరు, ఎన్ని మార్పులు చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పటిలోగా చేస్తారనేది వారికి క్లారిటీ కావాలి. ఇలా ప్రతి విషయంలోనూ ఉద్యోగులు పర్టిక్యులర్ గా ఉంటున్నారు. అంటే ఒకరకంగా వారు ప్రభుత్వం నుంచి కచ్చితమైన భరోసా కోరుకుంటున్నారు. అందుకే సజ్జల కమిటీ హామీ ఇచ్చినా అన్నీ రికార్డెడ్ గా ఉండాలను పట్టుబడుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ కూడా వాయిదా వేసుకోబోమని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: