విశాఖ విషాదం : పాస్టర్ కాదు బ్లఫ్ మాస్టర్ !
జీసస్ మమ్మల్ని క్షమించు
మీ పేరిట కొందరు తప్పులు చేస్తున్నారు
అన్యాయాలు చేస్తున్నారు
మత ప్రబోధకులం అంటూ చేయకూడనివి చేస్తున్నారు
లైంగిక దాడులకు పాల్పడుతూ అభంశుభం ఎరుగుని
మగువ జీవితాలనే ఛిత్రం చేస్తున్నారు
విశాఖ జిల్లా పాయకరావు పేటలో వెలుగు చూసిన దారుణం ఇది. చర్చి పాస్టర్ పేరిట సాగిస్తున్న దారుణాలకు తార్కాణం ఇది. చీకటి కార్యకలాపాలకు ఆనవాలు ఇది. ఓ చర్చి పాస్టర్ గా తనని తాను పరిచయం చేసుకుంటూ తరువాత ప్రబోధల పేరిట డబ్బులు దండుకుంటూ,అటుపై కోట్లకు అధిపతి అయి, సేవ పేరిట ప్రజలను మోసం చేసిన వైనం ఆలస్యంగానే వెలుగు చూసింది.
విశాఖ దారుల్లో పాస్టర్ ఏకంగా వందకోట్లు వసూలు చేసిన ఘటన పాయకరావుపేట కేంద్రంగా వెలుగు చూసింది.ఇక్కడి శ్రీరంగపురంలో ప్రేమదాసు అలియాస్ అంబటి అనిల్ ఇంతకుముందు రైల్వే లో టికెట్ కలెక్టర్ గా పనిచేసి,తరువాత పాస్టర్ అవతారం ఎత్తాడు.అటుపై ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ పేరిట ఓ చర్చిని ప్రారంభించాడు. అక్కడి నుంచి అతడి కథే మారిపోయింది. ఆయన అనుకున్న దాని కన్నా ఎక్కువగానే సంపాదించాడు.పాస్టర్ ముసుగులో వంద కోట్ల రూపాయల మేరకు ఆస్తులు సంపాదించాడు.
పేదలకు సాయం చేస్తానని, బాధితులకు అండగా ఉంటానని నమ్మబలుకుతూ ప్రార్థనా మందిరానికి వచ్చిన వారి దగ్గర నుంచి దండీగానే డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి.అంతేకాదు కొందరిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని, వారిని లైంగికంగా వేధించాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి.ఇందుకు ముగ్గురు వ్యక్తుల సాయంతో దేవుడి సేవ చేస్తానంటూ దండీగా డబ్బులు వసూలు చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.అతడి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని విశాఖ పోలీసులు చెబుతున్నారు.