టార్గెట్‌ ఉత్తరాంధ్ర: బీజేపీ ఐదు రోజుల ఉద్యమం..?

Chakravarthi Kalyan
ఏపీలో రాజకీయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ కొత్త ఉద్యమాలను నిర్మించి తద్వారా ప్రజలకు చేరువ కావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్ ల్లో అయిదు రోజుల ఉద్యమం నిర్వహించేందుకు కార్యచరణ సిద్దం చేసుకుంటోంది. ఉత్తరాంధ్ర నీటిపారుదల, పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీ ఉద్యమబాట పట్టనుందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సోము వీర్రాజు అంటున్నారు.


బీజేపీ ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ పదాధికారులతో విశాఖపట్నం నుంచి సోము వీర్రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు, నీటిపారుదల పెండింగ్ ప్రాజెక్టులను, వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని.. అందువల్ల ఈ ప్రాంత రైతులు.. లక్షలాది ఎకరాల్లో సరైన పంటలు పండించుకునే అవకాశాలు కోల్పోయారని సోము వీర్రాజు అంటున్నారు.


అందుకే ఉత్తరాంధ్ర నుంచి ఇంకా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు, వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా జనం వలసలు పోతున్నారని.. వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం, వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.5 కోట్లు చొప్పున వెచ్చంచాలని ఆయన డిమాండ్ చేసారు.  ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ.300 కోట్లు నీటిపారుదల, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం వైసీపీ ప్రభుత్వం వెచ్చిస్తే.. 5 లక్షల ఎకరాలకు నీరు లభిస్తుందని సోము వీర్రాజు లెక్కలు వేశారు.


ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నీటి పారుదల, పెండింగ్ ప్రాజెక్టులను నిర్లక్ష్యంతో చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఐదు రోజుల పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యమాన్ని నిర్వహించి, ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామని సోము వీర్రాజు చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్రాభివృద్ కోసం నిర్వహిస్తున్న ఈ 5 రోజుల ఉద్యమంలో నిర్వహించే ఆందోళనల కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని సోము వీర్రాజు పార్టీ నాయకులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: