అమరావతి : వైసీపీ నుండి కాపులను దూరం చేయటానికి టీడీపీ మాస్టర్ ప్లాన్ ?
వైసీపీని దెబ్బ కొట్టేందుకు తెలుగుదేశంపార్టీ సరికొత్త వ్యూహం మొదలుపెట్టినట్లుంది. ఆ వ్యూహం ఏమిటంటే విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు వంగవీటి రంగ పేరు పెట్టాలని. ఇప్పటికే కొత్త జిల్లాకు ప్రభుత్వం ఎన్టీయార్ జిల్లాగ ప్రకటించింది. వైసీపీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడతానని పాదయాత్ర సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి హామీఇచ్చారు. అప్పట్లో ఇచ్చిన హామీకి కట్టుబడే జిల్లాల పునర్వ్యవస్ధీకరణ నేపధ్యంలో కొత్త జిల్లా కు ఇపుడు ఎన్టీయార్ పేరుపెట్టారు.
ఇక్కడే టీడీపీ వ్యూహం అమల్లోకి తెస్తోంది. ఎన్టీయార్ పేరు పెడతానని ప్రకటించినపుడు వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. జిల్లాల సంఖ్యను పెంచుతు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినపుడూ రంగా పేరు డిమాండ్ చేయలేదు. అలాంటిది హఠాత్తుగా రంగా భజన మొదలుపెట్టేసింది. ఇక్కడ విచిత్రమేమిటంటే వంగవీటి రంగా కొడుకు వంగవీటి రాధా ఏమీ మాట్లాడలేదు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు తన తండ్రి పేరు పెట్టాలని రాధా అడగకపోయినా టీడీపీ నేత బోండా ఉమా దీక్షను ప్రకటించటం విడ్డూరమే.
తన తండ్రి పేరు పెట్టమని రాధా అడిగినా అర్ధముంటుంది కానీ బోండా ఉమా డిమాండ్ చేయటంలో అర్ధమేలేదు. పైగా కొత్త జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టడాన్ని టీడీపీ పాలిట్ బ్యూరో స్వాగతించినట్లు ఇదే బొండా ఆమధ్య మీడియాతో చెప్పారు. మరపుడు ఎన్టీయార్ పేరు పెట్టడాన్ని స్వాగతించి, ఇపుడేమో రంగా పేరు పెట్టాలని దీక్షకు కూర్చోవటంలో హిడెన్ అజెండా ఏమిటి ? బొండా దీక్షకు రెడీ అవటం చంద్రబాబునాయుడు అనుమతి లేకుండా అయితే జరగదుకదా.
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కాపులను వైసీపీకి దూరం చేయాలనే హిడెన్ అజెండా పెట్టుకున్నట్లే అనుమానంగా ఉంది. అందుకే రంగా పేరు వాడుకుంటున్నారు. ఒకసారి ఎన్టీయార్ పేరు పెట్టేసిన తర్వాత దాన్ని తీసేసి రంగా పేరు పెట్టడం జరిగే పనికాదని బోండాకు తెలీదా ? అంతగా కావాలంటే ఎన్టీయార్ పేరు వద్దని ఎన్టీయార్ కుటుంబసభ్యులతోనే చెప్పిస్తే అప్పుడు జగన్ రంగా పేరు ఆలోచిస్తారేమో. బోండా ఆపని చేయకుండా రంగా పేరుతో చేస్తున్న రాజకీయాన్ని జనాలు అర్ధం చేసుకోలేరా ?