మళ్లీ తెరపైకి అన్నాహజారే.. 14 నుంచి ఆమరణదీక్ష ?
మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు అన్నా హజారే మరోసారి ఆమరణ దీక్షకు కూర్చొంటున్నారు. ఈసారి ఆయన లక్ష్యం ఏంటో తెలుసా.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మద్యం విధానం.. ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన మద్యం విధానంతో రూ. 5000 లైసెన్స్ ఫీజు చెల్లించి సూపర్ మార్కెట్లు వంటి దుకాణాల్లో కూడా మద్యం అమ్మవచ్చు.
ఈ కొత్త విధానంతో మద్యం వినియోగం మరింత పెచ్చుమీరుతుందని అన్నా హజారే అంటున్నారు. ఈ విధానం ఉపసంహరించుకోవాలని ఆయన ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ఠాక్రేకు లేఖ రాశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వైన్ విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఆ పని చేయకుంేట ఫిబ్రవరి 14 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని అన్నా హజారే ప్రకటించారు. తన స్వగ్రామం రాలేగాన్ సిద్ధి వద్ద ఉన్న ఆలయంలో హజారే ఈ దీక్ష చేపడతానని చెప్పారు.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన అన్నా హజారే సమాజంలో అవినీతికి వ్యతిరేకంగా అనేక సార్లు నిరాహార దీక్ష చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చిన్నపిల్లలు బానిసలుగా మారడానికి దారి తీస్తుందని అన్నా హజారే అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల యువకులు, మహిళలు కూడా తీవ్రంగా ఇబ్బందిపడతారంటున్నారు అన్నా హజారే. త్వరలో రాలేగాన్ సిద్ధిలో సమావేశం నిర్వహించి ఉద్యమ దిశను నిర్ణయిస్తామని అన్నాహజారే ప్రకటించారు.