థాట్ ఆఫ్ ద డే : జ‌గ‌నొచ్చాడు ! జాబ్ వ‌చ్చిందా ?

RATNA KISHORE
ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ వేరు..ఆ రోజున్న బాధ్య‌త‌లు వేరు.ఆ రోజున్న క‌ష్టాలు మ‌రియు అవ‌మానాలు వేరు.. కానీ ఇప్పుడు ఆయ‌న అధికారంలో ఉన్నారు.అంటే అధికారం  కోస‌మే ఉన్నారు అని అర్థం.అధికారం నిలుపుకునే క్ర‌మంలో చాలా ప‌నులు చేస్తూ ఉన్నారు కూడా..అందులో భాగంగానే ఉచిత ప‌థ‌కాలు అనేకం అనౌన్స్ చేసి డ‌బ్బులు పంచుతున్నారు. కానీ ఉద్యోగాలు కోసం అర్రులు చాస్తున్న‌, ఉపాధి కోసం అర్రుల చాస్తున్న నిరుద్యోగ యువ‌త‌ను మాత్రం ఆయ‌న ఆదుకున్న దాఖ‌లాలు లేవు. ఇదే ఇప్పుడు వారంతా రోడ్డెక్కి నిర‌స‌న‌చేసేందుకు సిస‌లు కార‌ణం అవుతోంది.ఓవైపు పీఆర్సీ చాల్లేద‌ని త‌మ‌కు అది న‌చ్చ‌లేద‌ని ఉపాధ్యాయులు గ‌గ్గోలు పెడుతుంటే, మ‌రోవైపు త‌మ‌కు ఉపాధి మార్గం చూపించండ‌ని నిరుద్యోగులు వేడుకుంటున్నారు.అయినా జ‌గ‌న్ క‌రుణిస్తారా?

జ‌గ‌నొస్తే జాబ్ వ‌స్తుంద‌ని ఆ రోజు ఊద‌ర‌గొట్టారు. కానీ  ఇప్పుడు జ‌గ‌న్ వ‌చ్చినా కూడా ఎక్క‌డా జాబులు లేవు అని గ‌గ్గోలు పెడుతున్నారు నిరుద్యోగులు.పాపం! వీళ్లంతా రెండు ల‌క్ష‌ల 30 వేల ఉద్యోగ భ‌ర్తీ కోసం వేచి చూస్తున్నారు.ఈ రోజు ఇదే ప్ర‌ధాన డిమాండ్ తో ఆల్ ఇండియా యూత్ ఫెడ‌రేష‌న్ (ఏఐవైఎఫ్) రోడ్డెక్కింది.క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డికి ప్లాన్ చేసింది. కానీ ధ‌ర్నాను భ‌గ్నం చేశారు పోలీసులు.వీరిని స‌మీప స్టేష‌న్ల‌కు త‌ర‌లించి నిర్బంధించి త‌రువాత వ‌దిలేశారు.కొంద‌రిని మార్గ మ‌ధ్య‌లోనే నిలివేశారు. ఆ రోజు జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నిరుద్యోగుల కోసం అండ‌గా ఉంటాన‌ని చెప్పారు.చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని కూడా అన్నారు.తాను అధికారంలోకి వ‌స్తే అంద‌రికీ న్యాయం చేస్తామ‌నీ అన్నారు.


కానీ ఇప్పుడు అవేవీ కాకుండా పోయాయి.రాష్ట్రంలో కొత్త కొలువుల సంద‌డి లేనేలేదు.స‌చివాలయ ఉద్యోగాలు మిన‌హా రెగ్యుల‌ర్ పోస్టులు తీసిందీ లేదు..ఖాళీల‌ను భ‌ర్తీ చేసింది లేదు.దీంతో చాలా మంది నిరుద్యోగులు ఆశ‌ల‌న్నీ వ‌దులుకుని, నోటిఫికేష‌న్లు ఇక రావని తేలాక వ‌ల‌స‌లు వెళ్తున్నారు.


శ్రీ‌కాకుళం నుంచి అనంతపురం వ‌ర‌కూ ఇవాళ ఇదే విధంగా చాలా మంది ఊళ్లు దాటి పోతున్నారు. గ‌ల్ఫ్ దేశాల‌ను ఆశ్ర‌యించి దుర్భ‌రావ‌స్థ‌ల మ‌ధ్య ఉద్యోగాలు చేస్తున్నారు. మ‌రి!జ‌గన్ ఇచ్చిన డిమాండ్ ఏమ‌యింది.పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా వేయని లేదా వేయ‌లేని స్థితిలో ఓ గ‌వ‌ర్నమెంట్ ఉంటే నిరుద్యోగులు నిల‌దీయ‌క ఏం చేస్తారు? అరె! బాబూ జ‌గ‌న్ జ‌ర శోచోరే!


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: