ఏపీలో పెరిగిన సినిమా టికెట్ల రేట్లు ఇవేనా..?

Chakravarthi Kalyan
తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు నిన్న సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేశ్ బాబు, ఆర్. నారాయణమూర్తి వంటి సినీ దిగ్గజాలు సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి జగన్ కు వివరించారు. జగన్‌ తో భేటీ తర్వాత సినిమా ఇండస్ట్రీ పెద్దలు మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి.. సినిమా ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడినట్టేనని సంకేతాలు ఇచ్చేశారు. సినిమా టికెట్ల ఇష్యూను సీఎం ఫైనల్ చేశారని సినిమా పెద్దలు చెప్పారు. అయితే.. కొత్త టికెట్‌ రేట్లు ఎలా ఉన్నాయి.. ఎంత ఉన్నాయి.. ఏ ప్రాంతంలో ఎంత అన్నదానిపై స్పష్టత రాలేదు. ఈ నెలాఖరుకు జీవో వస్తుందని మాత్రమే సినీపెద్దలు చెప్పారు.


అయితే.. సినిమా టికెట్ల రేట్లు పెంచాలని నిర్ణయించిన ఏపీ సర్కారు.. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ కొత్త రేట్ల ప్రకారం.. గరిష్ఠంగా 150 రూపాయలు.. కనిష్ఠంగా 20 రూపాయలు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సినీ ప్రముఖులతో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని.. త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. అన్ని థియేటర్లలో నాన్‌ ప్రీమియం సీట్లు 25% వరకు ఉండాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందట.


మల్టీప్లెక్సుల విషయంలో నాన్‌ ప్రీమియం సీట్లపై ఇంకా స్పష్టత రాలేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. గతంలో ప్రతి కేటగిరీలో మూడు తరగతులుగా సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించారు. ఆ మేరకు పాత జీవో విడుదలైంది. కానీ.. కొత్త జీవో ప్రకారం ఎకానమీ, డీలక్సు, ప్రీమియంగా విభజించి టికెట్ల ధరలు నిర్ణయిస్తారట. మల్టీప్లెక్సుల్లో రిక్లయినర్ సీట్లకు 250 రూపాయల వరకూ టికెట్ ఉంటుందట. ఈ కొత్త రేట్లు అటు సినీ వర్గాలకూ.. ఇటు ప్రేక్షకులకూ కూడా ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాకపోతే.. ఇప్పడే ఇవి ఫైనల్‌ కాదు.. ఇంకా తుదిమెరుగులు దిద్దే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఈ నెలాఖరుకు జీవో వస్తుందని సినీ పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: