కోర్టు కేసులతో కొత్త జిల్లాలు ఆలస్యం అవుతాయా..?
కొత్త జిల్లాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్న ఏపీ ప్రభుత్వం ఈనెల 16నుంచి అభ్యంతరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తుంది. మార్చి 3 వరకు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన అభ్యంతరాలను కలెక్టర్లు, ఇతర అధికారులు స్వీకరిస్తారు, వాటిని ఆన్ లైన్ లో పొందు పరుస్తారు. మార్చి 15 నుంచి రెండు రోజులలోగా చివరి నోటిఫికేషన్ జారీ చేస్తారు. మార్చి 18న గెజిట్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు ఇక లాంఛనమే. మార్చి 18న గెజిట్ విడుదలైందంటే జిల్లాలు ఏర్పడినట్టే. ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతుంది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, కొత్త జిల్లాలో విషయంలో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. రాజంపేట జిల్లా విషయంలో అధికార పార్టీలోనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇక బాలాజీ జిల్లా విషయంలో కూడా గూడూరు వాసులు రగిలిపోతున్నారు. హిందూపురం జిల్లాకోసం ఏకంగా బాలయ్య రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా, మిగతా పేర్లెందుకు పెట్టరంటూ మరికొంతమంది కొత్త జాబితా తెరైపకి తెచ్చారు. ఇలాంటి అభ్యంతరాల మధ్య కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యపడుతుందా లేక వీరిలో ఎవరైనా కోర్టు మెట్లెక్కితే ఆగిపోతుందా అనేది అసలు సమస్యగా ఉంది. జిల్లాల విభజన అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని అంశం. దీనిపై కోర్టులో సవాళ్లు చేసినా అవి వీగిపోతాయని అంటున్నారు న్యాయనిపుణులు. అందుకే ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరిస్తోంది, వాటికి తగిన సమాధానాలిస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టు కేసులతో కొత్త జిల్లాలు ఆగిపోయే ప్రసక్తే లేదని తెలుస్తోంది. కొత్త జిల్లాల పాలనపై అందుకే ప్రభుత్వం అంత నమ్మకంగా బరిలో దిగింది.