పెట్రోల్ రేట్లు పెంచుతారు జాగ్రత్త..!

NAGARJUNA NAKKA
యూపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తెల్లారే బీజేపీ పెట్రోల్ రేట్లు పెంచుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయనీ.. సబ్సిడీలు కట్ చేస్తున్నారన్నారు. పేదల నోరు కొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ గొడ్డలి భుజాల మీద పెట్టుకొని తిరుగుతుందన్నారు. యూపీ ఎలక్షన్లు ఓట్లు డబ్బాల్లో పడ్డ తెల్లారే పెట్రోల్ రేట్లు మళ్లీ పెంచుతారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ పాలకుల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రఫేల్ జెట్ విమానాల కొనుగోలులో గోల్ మాల్ జరిగిందని... భారత్ కంటే తక్కువ ధరకు ఇండోనేషియాకు రఫేల్ విమానాలు కొనుగోలు చేసిందన్నారు. రఫేల్ కుంభకోణం బయటకు తీయాలని.. అందులోని దొంగలు బయటకు రావాలన్నారు. బీజేపీ అవినీతి గురించి ఢిల్లీలో పంచాయితీ పెడతానన్న కేసీఆర్.. మోడీ పాలన అవినీతి కంపు అని.. ఈ ప్రభుత్వ అవినీతిపై సుప్రీం కోర్టులో కేసు వేస్తానన్నారు.
12శాతం జీడీపీ వృద్ధి ఉండే ఎక్కడైనా ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రధాని మోడీ అవసరం దేశానికి లేదని.. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధికి ప్రధాని, ఆర్థిక మంత్రి అవసరం లేదని.. సహజంగా జరిగేదేనని చెప్పారు. చేతనైతే చైనా, సింగపూర్ లాగా దేశాన్ని మార్చాలన్న కేసీఆర్.. మోడీకి ఇచ్చిన టైమ్ లో 80శాతం అయిపోయిందన్నారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టకుంటే దేశం నాశనం అయిపోతుందన్నారు.
మిషన్ భగీరథ ప్రారంభోత్సవ సభలో మోడీ అబద్దాలు చెప్పారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు యూనిట్ విద్యుత్ రూ.1.10కే ఇస్తున్నట్టు మోడీ చెప్పారు. ఎప్పుడైనా ఇచ్చారా.. తన పక్కనే ఉండి అబద్దం చెబుతున్నా మర్యాద కోసం మాట్లాడలేదన్నారు. 40వేల మెగా వాట్ల ప్రాజెక్టులు పూర్తయినా కరెంట్ ఉత్పత్తి చేయనివ్వడం లేదన్నారు. విద్యుత్ రంగం ప్రైవేటీకరించి.. బీజేపీకి విరాళాలిచ్చే వారి నుంచి సౌర విద్యుత్ కొనిపించాలని చూస్తున్నారని కేసీఆర్ చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: