అతిపెద్ద గిరిజన జాతరలో ఏ రోజు ఏం జరుగుతుందంటే..!

NAGARJUNA NAKKA
ఆసియాలోనే అతిపెద్దదైన గిరిజన జాతరకు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సిద్ధమయింది. ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే ఈ జాతరకు కోటిమందికి పైగా భక్తులు రానుండగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరి పొలిమేరలోని జంపన్న వాగులో స్నానం చేసి.. జంపన్న గద్దెకు మొక్కి.. ఆ తర్వాత సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు వెళ్తారు. రైలు, బస్సులో వరంగల్ కు చేరుకుంటే.. అక్కడి నుంచి స్పెషల్ బస్సులుంటాయి.
ఈ ఏడాది సమ్మక్క, సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు దర్శించుకునే అవకాశముందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని.. పుణ్య స్నానాల జంపన్నవాగులోకి నీరు విడుదల చేస్తామన్నారు. మేడారంలో ప్రధాన ఆస్పత్రితో పాటు మరో 35 హెల్త్ క్యాంపుల, 6వేల 700 టాయిలెట్లు ఏర్పాటు చేశామని సోమేశ్ కుమార్ వివరించారు. రేపటి నుంచి జాతర ప్రారంభం కానుంది.
16వ తేదీన మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్ను గద్దెకు తీసుకువస్తారు. 17వ తేదీ రెండో రోజు చిలకగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. 18వ తేదీ మూడో రోజు అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలువుతీరుతారు. 19వ తేదీ నాలుగో రోజు సాయంత్రం ఆవాహన పలికి అమ్మవార్లను యుద్ధ స్థానానికి తరలిస్తారు.
ఇక మేడారం వచ్చే భక్తుల కోసం ఈ నెల 13 నుంచే హెలికాప్టర్ సర్వీసులను పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ నుంచి మేడారం వెళ్లి రావడానికి ఒక్కొక్కరికి 19వేల 999రూపాయలుగా, మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి 3వేల 700రూపాయలుగా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. హాట్ ఎయిర్ బెలూన్, పారా సెయిలింగ్ రైడ్లు అందుబాటులోకి వచ్చేశాయి.
మరోవైపు తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు సెలవులు లేకపోవడంతో.. ఉద్యోగులు, విద్యార్థులు తల్లిదండ్రులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే భాగ్యాన్ని కోల్పోతున్నారు. కోటి మందికి పైగా తరలివచ్చే ఈ జాతరకు స్వరాష్ట్రంలోనైనా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: