తిరుమల కొండపై కొత్త ఆలయాలు వద్దా..? మనుషులు విగ్రహ ప్రతిష్ట చేయకూడదా..?
ఏడుకొండలపై మనుషుల చేతుల మీదుగా ఎలాంటి విగ్రహ ప్రతిష్ట జరగకూడదని తిరుమళై ఒరుగు అనే పుస్తకంలో ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తిరుమలలో కొత్తగా ఆలయం నిర్మించడం సరికాదని, అది శ్రీవారి వైభవాన్ని తగ్గించినట్టు ఉంటుందని ప్రస్తావించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. పూర్తి వివరాలను తమకు తెలియజేయాలంటూ ఈవోకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది. మరోవైపు ఆంజనేయుడు జన్మస్థలం తిరుమలేనంటూ జరుగుతున్న ప్రచారాన్ని కిష్కింధకు చెందిన గోవిందానంద సరస్వతి వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది.
టీటీడీ తక్షణ కర్తవ్యం..
అయితే టీటీడీ తరపున న్యాయవాది.. అంజనాద్రిలో కేవలం సుందరీకరణ పనులు చేపడుతున్నామని, ఆలయ నిర్మాణం చేయబోవట్లేదని కోర్టుకి తెలిపారు. కానీ టీటీడీ ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు మాత్రం తెలుస్తోంది. కోర్టు తీర్పుతో ఇప్పుడది సందిగ్ధంలో పడింది. అంజనాద్రిని ఆంజనేయుడి జన్మస్థలంగా ప్రకటించడంతోనే అసలు గొడవ మొదలైంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆలయం నిర్మించాలనుకోవడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. కోర్టు కేసుల వరకూ వెళ్లింది. మరిప్పుడు టీటీడీ ఏం చేస్తుందో చూడాలి. కేవలం సుందరీకరణ పనులతో సరిపెడుతుందా.. కోర్టు ముందు వివరాలుంచి ఆలయ నిర్మాణానికి అనుమతి తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా తిరుమలే ఆంజనేయుడి జన్మస్థలం అంటూ టీటీడీ చేస్తున్న ప్రచారం ఇప్పుడు సంచలనంగా మారింది.