కొత్త మంత్రుల ఫైనల్ లిస్ట్.. సీనియర్లకు మరోసారి చేదు అనుభవం..?
జిల్లాల వారీగా ఆశావహులు, అర్హుల జాబితాని గతంలోనే సీఎం జగన్ సేకరించారు. ఓ దఫా వాటిలో మార్పులు చేర్పులు జరిగాయని కూడా సమాచారం. తన తొలి మంత్రి వర్గం కూర్పుని ఎలాంటి సంచలనాలకు వేదికగా చేసుకున్నారో.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో సంచలనాలకు వేదికగా మార్చుకోబోతున్నారు. సీనియర్లను మరోసారి జగన్ పక్కనపెడుతున్నారని తెలుస్తోంది. యువతరాన్ని మరోసారి అందలమెక్కిస్తారు.
గతంలో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలిచ్చినా.. కొంతమంది సద్వినియోగం చేసుకోలేకపోయారు. మరికొందరు మాత్రం తొలిసారి మంత్రి పదవి అందుకున్నా కూడా తమ ప్రతిభ నిరూపించుకున్నారు. దీంతో ఇప్పుడు కొత్తగా ఇచ్చేవారిలో కూడా యువతకు పెద్దపీట వేస్తే ఎలా ఉంటుందోనని జగన్ ఆలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు సీనియర్ల విషయంలో కూడా ఆయన సీరియస్ గా ఆలోచిస్తున్నారట. బొత్స, ధర్మాన కృష్ణదాస్ వంటి ఒకరిద్దరు సీనియర్లు మాత్రమే జగన్ తొలి టీమ్ లో ఉన్నారు. ఇప్పుడు మలి దఫా టీమ్ లో అలాంటి వారికి అవకాశం ఉందా, లేక పూర్తిగా కొత్తవారితోనే కొత్త మంత్రి మండలి ఏర్పాటు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. కరోనా కాలంలో కొన్నాళ్లుగా పాలన కూడా పూర్తిగా జరగని పరిస్థితి. దీంతో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణను వాయిదా వేసుకుంటూ వచ్చారు జగన్. ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కచ్చితంగా కొత్త టీమ్ రంగంలోకి దిగే అవకాశముంది.