హైదరాబాద్ : నిరసనలు జుగుప్స కలిగిస్తున్నాయా ?
రాను రాను నిరసనలు జుగుప్సను కలిగిస్తున్నాయి. ఆందోళనలు, నిరసలు తెలపటమన్నది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయపార్టీలు లేదా ప్రజలు నిరసనలు తెలపటం రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ప్రతిపక్షాలు తెలిపే నిరసనలు అన్నీ హద్దులు దాటిపోతున్నాయి. చివరకు నిరసనలంటేనే జుగుప్స కలిగేట్లుగా తయారైపోయాయి. రీసెంటుగా కేసీయార్ జన్మదినం సదర్భాన్ని తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు.
వాళ్ళ పార్టీ అధినేత+ముఖ్యమంత్రి కాబట్టి మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా పాల్గొన్నారు. ఇదే సమయంలో కేసీయార్ జన్మదినం వేడుకలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఒకవైపు జన్మదినాన్ని టీఆర్ఎస్ ఘనంగా జరుపుకుంటున్న రోజే కాంగ్రెస్ నిరసనలు తెలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలిపినా కాస్త హుందాగా ఉండాలి. కానీ కాంగ్రెస్ నేతలు చాలా చోట్ల గాడిదల మెడల్లో కేసీయార్ ఫొటోలు పెట్టి ఊరేగించారు. ఇది చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది.
సరే కాంగ్రెస్ అంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉందని అనుకుందాం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ నిరసనలు తెలిపారు. ఇందులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫొటో పెట్టి దానికి దండేసి పిండ ప్రదానం చేశారు. ఫొటోకి దండేయటం, పిండ ప్రదానం చేయటమంటే అందరికీ అర్ధమైపోయుంటుంది. ఇది చూడటానికే అసహ్యంగా ఉంది. ఈమధ్య ఫేస్ బుక్ లో కూడా పార్టీల అధినేతల ఫొటోలకు దండేసేయటం ఎక్కువైపోయింది.
వీళ్ళ వెర్రితనం ఇలాగుంటే పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీని కాళీ అవతారంలోను నరేంద్రమోడి, అమిత్ షా లను మహిషాసులుగాను చిత్రీకరించి పెద్ద పెద్ద పోస్టర్లు వెలిశాయి. దాంతో బీజేపీ నేతలు మండిపోతున్నారు. అంటే రేపెప్పుడో మమతను మరింత హీనంగా చూపిస్తు బీజేపీ వాళ్ళు పోస్టర్లు వేయటం ఖాయమని అర్ధమైపోతోంది. రాజకీయ పార్టీల అధినేతలు ఒకళ్ళకు మరకొళ్ళు ప్రత్యర్ధులుగా కాకుండా శతృవులుగా అయిపోవటం వల్లే ఇలాంటి దరిద్రాలు చోటు చేసుకుంటోంది. ముందు ముందు ఇంకెన్ని దరిద్రాలను చూడాలో ఏమో .