కరోణ మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. దీనికి తోడుగా పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో పిల్లల స్కూలు ఫీజులు తల్లిదండ్రులకు మరింత భారంగా మారాయి. దీంతో సర్కార్ ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులు నియంత్రించేందుకు చర్యలు తీసుకోనుంది. మరి ఫీజులపై ఏం చేయబోతుందో తెలుసుకుందామా..! ప్రైవేట్ విద్యాసంస్థలు పిల్లల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్ వారికి గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రైవేట్ విద్యాలయాల్లో ఫీజుల నియంత్రణ మీద సర్కార్ నిర్ణయం తీసుకోగా, దానికి అవసరమైన విధి విధానాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తోంది.
దానికి సంబంధించి ఫిబ్రవరి 21వ తేదీన మంత్రుల బృందంతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం అవ్వనుంది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటుగా సహ సబ్ కమిటీ రాష్ట్రం మొత్తం ప్రైవేట్ పాఠశాలలు, డిగ్రీ జూనియర్ కళాశాలల ఫీజుల నియంత్రణ కు సంబంధించినటువంటి విధివిధానాలపై అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వనుంది. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ శేషన్లో ఫీజుల నియంత్రణ పై సరి కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఫీజుల నియంత్రణ కై సంబంధించిన విధి, విధానాలను, ఇతర రాష్ట్రాల్లో మరి ఏ విధంగా నియంత్రణ చేశారో విద్యాశాఖ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీన్ని ఆ తర్వాత మంత్రుల ముందు సమర్పించనున్నారు. సర్కార్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంపై సబ్కమిటీ చర్చించనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా పాఠశాలలో ట్యూషన్ ఫీజు పేరుతో తల్లిదండ్రుల నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు పేరుతో ప్రతి విద్యా సంవత్సరం 30 శాతం నుంచి 40 శాతం పెంచుతున్నాయి. అదేవిధంగా నిట్, ఎంసెట్, జెఈఈ వంటి ప్రవేశ పరీక్షల కోసం ఇన్సెంటివ్ స్పెషల్ కోచింగ్ పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.