ఆపరేషన్ సమంత.. వారి కలలు నిజం చేస్తున్నారు..

Deekshitha Reddy
పేరులో సమంత ఉంది కాబట్టి.. ఇదేదో హీరోయిన్ సమంతకు చెందిన విషయం అని పొరపడొద్దు. ఇది కేవలం సమానత్వానికి చెందిన విషయం. అవును, తరతరాలుగా అవమానింపబడుతున్న దళితులకు సాంత్వన చేకూర్చే అంశం. రాజస్థాన్ లో దళితుల ఆత్మగౌరవానికి చెందిన అంశం. అగ్రవర్ణాల చేతిలో అవమానాలకు గురవుతున్న వారికోసం పోలీసులు చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమం.

రాజస్థాన్ లో గుర్రం ఎక్కడం కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే చెందిన అంశం అనే కట్టుబాటు ఉంది. అక్కడ నిమ్న వర్గాలకు చెందినవారు అవసరం ఉన్నా కూడా గుర్రం ఎక్కకూడదు. కనీసం పెళ్లి, ఆ తర్వాత జరిగే ఫంక్షన్లలో కూడా వారు గుర్రం ఎక్కడానికి అనుమతి లేదు. అలా ఎక్కితే గ్రామ బహిష్కరణ వేటు వేస్తారు, ఆయా కుటుంబాలను దూరం పెడతారు. కొన్ని సందర్భాల్లో ఆ ఫంక్షన్లలోనే గొడవలు జరిగిన ఉదాహరణలు కూడా ఉన్నాయి.

ఆపరేషన్ సమంత..
ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెడుతూ రాజస్థాన్ పోలీసులు ఆపరేషన్ సమంతను చేపట్టారు. అందరూ సమానమే అని ప్రజలకు చాటి చెప్పేందుకు ఆపరేషన్ సమంత మొదలు పెట్టారు. దళితుల వివాహాలకు పోలీస్ రక్షణ కల్పిస్తున్నారు. వరుడు గుర్రం ఎక్కి ఊరేగింపు జరిగే సందర్భంలో పోలీసులు రక్షణగా వస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో ఇలా పెళ్లికి రక్షణగా వెళ్లారు పోలీసులు. ఆ తర్వాత పలు గ్రామాల్లో దీన్ని కొనసాగిస్తున్నారు. దళితులు గుర్రం ఎక్కితే వారిని ఎవరూ అడ్డుకోకుండా పోలీసులు రక్షణగా వస్తారు. గ్రామంలో సర్పంచ్ తో కలసి కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నరు. ఇప్పుడిప్పుడే రాజస్తాన్ లో పరిస్థితులు మారుతున్నాయి. ఆపరేషన్ సమంతతో మంచి ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు. వివక్షని రూపుమాపే దిశగా దీన్ని అమలు చేస్తున్నారు పోలీసులు. రాజస్థాన్ లో గతంలో ఉన్న కొన్ని దురాచారాలు కూడా ఇప్పుడిప్పుడే కనుమరుగవుతున్నాయి. ఆపరేషన్ సమంతతోపాటు.. మరిన్ని కార్యక్రమాలను అక్కడి పోలీస్ డిపార్ట్ మెంట్ మొదలు పెట్టే ఆలోచనలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: