వర్ల రామయ్య కొడుకుపై కేసు.. ఏం చేశారంటే..?

Chakravarthi Kalyan
అధికార వైసీపీ పై మాటలతో విరుచుకుపడే టీడీపీ నేత వర్ల రామయ్య కొడుకుపై పోలీస్‌ కేసు నమోదైంది. వర్ల రామయ్య టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కూడా.. ఆయన ప్రస్తుతం పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా కూడా ఉన్నారు. అధికార పార్టీ, జగన్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడే టీడీపీ నేతల్లో వర్ల ఒకరు. ఆయన కొడుకు వర్ల కుమార రాజాపై విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆదివారం ఈ  కేసు పెట్టారు.

ఇంతకీ అసలేం జరిగిందంటే.. విద్యాధరపురం 44వ డివిజన్‌ చిన్నసాయిబాబా గుడి ఆర్చి వద్ద గొడవ జరిగింది. తాగునీటి పైపులైన్ల నిర్మాణం కోసం శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నారు. ఆ పని శేఖర్‌ అనే వ్యక్తి చేస్తున్నారు. శనివారం శేఖర్ కూలీలతో శిలాఫలకం పనులు చేయిస్తున్నాడు. ఆ సమయంలో వర్ల కుమారుడు కుమార రాజా అక్కడ శిలాఫలకం కట్టొద్దని గొడవ చేశాడట. అంతే కాదు.. అక్కడ శిలా ఫలకం కడితే  చంపుతానంటూ బెదిరించారట. ఈ మేరకు శేఖర్‌ విజయవాడ నగరపాలక సంస్థ తాగునీటి సరఫరా అసిస్టెంట్‌ ఇంజినీరు అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు.. దీంతో ఏఈ అహ్మద్‌ భవానీపురం పోలీసులకు కుమార రాజాపై  ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వివాదంపై భవానీపురం ఎస్‌ఐ ప్రసాద్‌ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

అయితే.. ఈ వివాదంపై ఇంత వరకూ వర్ల రామయ్య స్పందించలేదు.. టీడీపీ నాయకులు మాత్రం వర్ల రామయ్యను కట్టడి చేసేందుకే ఆయన కొడుకుపై కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వివాదాలను కూడా  పెద్దవి చేసి చూపుతూ కేసులు పెడుతూ బెదిరంచే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

వర్ల రామయ్య ఎస్సీ నేత కావడంతో.. ఆయన్ను టీడీపీ బలమైన వాయిస్‌గా ఉపయోగిస్తోంది. ఆహార్యం, స్వరం గంభీరంగా ఉండటం వల్ల వర్ల రామయ్య తరచూ ప్రెస్‌ మీట్లు నిర్వహిస్తుంటారు. అధికార పార్టీపై నిప్పుల్లాంటి మాటలతో విరుచుకుపడుతుంటారు. ఇలా వైసీపీపై విరుచుకుపడే నేతలను టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పట్టాభి వంటి వారిని కూడా టార్గెట్ చేశారన్న విమర్శలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: