రాయలసీమ : కుప్పంలో టీడీపీని ఎందుకోడించారో ఆర్ధమైందా ?

Vijaya



ఇప్పటికైనా తెలుగుదేశంపార్టీని కుప్పంలో జనాలు ఎందుకు ఓడించారో చంద్రబాబునాయుడుకు అర్ధమయ్యుండాలి. తాజాగా కుప్పం డెవలప్మెంట్ విషయమై జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు లేఖరాయమే దీనికి నిదర్శనం. ఇంతకీ లేఖలో ఏముందంటే కుప్పంను రెవిన్యు డివిజన్ చేయాలనుంది. కుప్పంను రెవిన్యు డివిజన్ చేయాలనేది కుప్పం ప్రజల చిరకాల డిమాండని చంద్రబాబుకి ఇప్పటికి తెలిసింది.




కుప్పం డెవలప్మెంట్ కోసమే గతంలో కుప్పం డెవలప్మెంట్ అథారిటి (కాడా)ను ఏర్పాటు చేసిన విషయాన్ని తన లేఖలో గుర్తుచేశారు. 1989 నుండి కుప్పంకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గానికి చంద్రబాబు లాంటి అంతర్జాతీయ స్ధాయి నేత ప్రాతినిధ్యం వహిస్తుంటే అసలు ఏ స్ధాయిలో డెవలప్ అయ్యుండాలి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేసిన చంద్రబాబు తన నియోజకవర్గాన్ని డెవలప్ చేయమని కలెక్టర్ కు లేఖ రాయటమంటే నిజంగా సిగ్గుపడాలి. సీఎంగా ఉండి చేయాల్సిన పనులను ప్రతిపక్షంలో ఉండి కలెక్టర్ కు లేఖలు రాయటమే విచిత్రం. 




14 ఏళ్ళు సీఎంగా పనిచేసినపుడు తన నియోజకవర్గాన్ని ఎందుకని డెవలప్ చేసుకోలేకపోయారు.  ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం డెవలప్ కావాల్సినంతగా కాలేదంటే అందుకు సిగ్గుపడాల్సింది చంద్రబాబే. పైగా కుప్పంను రెవిన్యు డివిజన్ చేయాలనేది జనాల చిరకాల కోరికట. మరి సీఎంగా ఉన్నపుడు కుప్పాన్ని  తానేందుకు రెవిన్యు డివిజన్ చేయలేదు.




చివరకు కుప్పం మేజర్ పంచాయితిని మున్సిపాలిటిగా చేయమని కుప్పం జనాలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జనాల డిమాండ్ మేరకు కుప్పంను మున్సిపాలిటిగా అప్ గ్రేడ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కుప్పంను చంద్రబాబు పట్టించుకోలేదన్నది వాస్తవం. ఇంతకాలం చంద్రబాబు ఆడింది ఆటగా సాగిపోయింది. వైసీపీ రూపంలో బలమైన ప్రతిపక్షం ఎదురయ్యే సరికి జనాలు కూడా ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఇందుకనే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీని వరసబెట్టి జనాలు ఓడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: