పవన్ కొత్త స్లోగన్: జై తెలంగాణ.. జై ఆంధ్ర.. జై అమరావతి..?
తెలంగాణలో రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా.. పవన్ కల్యాణ్ హైదరబాద్ వాసిగా సినిమాలు, ఆస్తుల కోణంలోనూ జై తెలంగాణ అన్నారని భావిస్తున్నారు. ఇక ఆంధ్రా విషయం చెప్పనక్కర్లేదు.. ఆంధ్రా విషయంలో మాత్రం పవన్ కల్యాణ్‌కు చాలా ఆకాంక్షలే ఉన్నాయి. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు వచ్చినా పవన్ జనంలోకి వెళ్తే అదో క్రేజ్.. ఆ హంగామా మామూలుగా ఉండదు.. అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ మొహం మొత్తితే ఏపీ ప్రజలకు ఉన్న బిగ్ ఆప్షన్ పవన్ కల్యాణ్ అవుతాడని కొందరు విశ్లేషిస్తుంటారు.
ఆ సంగతి ఎలా ఉన్నా.. పవన్ కల్యాణ్ మాత్రం ప్రజలకు ఏదో చేయాలన్న కసితో ఉంటారు. అలాగని పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. గతంలోనే అనేక సార్లు అమరావతికి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్... దాన్ని కాపాడుకునేందుకే జై ఆంధ్రా, జై అమరావతి అంటూ నినాదం చేశారు.
ఇదే సమయంలో పవన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కేటీఆర్ ను తాను ప్రేమగా రామ్ బాయ్ అంటానన్న పవన్.. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు సరిపడవన్నారు. చిత్రపరిశ్రమలో రాజకీయ నాయకులు ఉండరని.. ఇక్కడ అంతా కళాకారులే ఉంటారని వ్యాఖ్యానించారు. నేను రాజకీయాల్లో ఉన్నా సినిమాయే తనకు అన్నం పెడుతోందని పవన్ కల్యాణ్ అన్నారు.