హైదరాబాద్ : ఓవర్ టు ఢిల్లీ..వ్యూహం మారిందా ?
కేసీయార్ వ్యూహం మార్చుకున్నట్లే ఉంది. ఢిల్లీకి వెళుతున్న కేసీయార్ వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలను కలవబోతున్నారు. ఇప్పటికే ఉధ్ధవ్ థాక్రే, శరద్ పవార్, స్టాలిన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి తొందరలోనే మమతాబెనర్జీతో కూడా సమావేశం అవబోతున్నారు. వీళ్ళతోనే కాకుండా ఢిల్లీలో ఉండే ప్రాంతీయపార్టీల అధినేతలతో సమావేశానికి రెడీ అవుతున్నారు.
మామూలుగా అయితే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీలతోనే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే కోరిక కేసీయార్ లో బలంగా ఉంది. కానీ కొన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతో కలిసినపుడు కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ వేదిక సాధ్యం కాదని వాళ్ళు కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారు. దాంతో పునరాలోచనలో పడినట్లు అర్ధమవుతోంది. కాంగ్రెస్ గురించి కాస్త సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడుతుండటం ఇందులో భాగమే అంటున్నారు.
మొదలు పెట్టడమే నరేంద్రమోడీపై యుద్ధమని, ఢిల్లీ కోటను బద్దలు కొడతానని, మోడి అవినీతి చిట్టా అంతా విప్పుతానంటు నానా రచ్చ చేసిన కేసీయార్ ఎందుకనో కాస్త స్లో అయ్యారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మోడి కత చెప్పాలంటే కేసీయార్ ఇంకా రెండున్నరేళ్ళు ఆగాలి. కానీ ఈలోగానే వస్తున్న రాష్ట్రపతి ఎన్నికనే ప్రత్యామ్నాయ వేదికకు ముందు వేదికగా చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ లేదా ఎన్డీయే అభ్యర్ధికి ధీటైన అభ్యర్ధిని నిలపాలనే ఆలోచనలో కేసీయార్ ఉన్నట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి.
బహుశా శరద్ పవార్ కావచ్చు లేదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా వినబడుతోంది. ఇపుడు నితీష్ ఎన్డీయేలోనే ఉన్నప్పటికీ తొందరలోనే బయటకు వచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదేగనుక జరిగితే నితీష్ మంచి ఛాయిస్ అవుతారేమో చూడాలి. పవార్ కూడా ఎప్పటి నుండో రాష్ట్రపతి పదవి మీద కన్నేశారు. సరే అభ్యర్ధి ఎవరన్నది పక్కన పెట్టేస్తే ప్రాంతీయపార్టీలు+కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పక్షం తరపున గట్టి అభ్యర్ధిని పోటీకి దించాలి. సదరు అభ్యర్ధిని గనుక గెలుపించుకోగలిగితే దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోవటం ఖాయం. ఈ విషయాలన్నీ మాట్లాడేందుకే కేసీయార్ ఢిల్లీకి వెళుతున్నారట. మరి ఏమవుతుందో చూడాల్సిందే.