మణిపూర్ ఎన్నికలు: పార్టీకంటే... అభ్యర్థికే అధిక ప్రాధాన్యం

VAMSI
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల అంశం జాతీయ పార్టీలకు కునుకు లేకుండా చేస్తోంది అని చెప్పాలి. అందులో భాగంగా ఇవ్వాళ మణిపూర్ రాష్ట్రంలో ఎన్నిక ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల నుండి అత్యంత పకడ్బందీగా ఎన్నికలు మొదలు అయ్యాయి. అయితే ఇది కేవలం మొదటి విడత మాత్రం. ఈ మొదటి విడుతలో 5 జిల్లాలలో 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ 38 ఎమ్మెల్యే స్థానాల కోసం మొత్తం 173 మంది పోటీ పడుతున్నారు. ఇందులో కొందరు ప్రముఖులు పోటీ పడుతుండడం విశేషం. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం సీఎంగా ఉన్న బీరెన్ సింగ్ మరియు ఉప ముఖ్యమంత్రి బరిలో ఉన్నారు.

కాగా సీఎం గా ఉన్న బీజేపీ అభ్యర్థి బీరేన్ సింగ్ విజయం నల్లేరుపై నడక అనే చెప్పాలి. ఎందుకంటే ఈయనకు రాజకీయం పరంగా మంచి రికార్డు ఉంది. 2007 నుండి వరుసగా ఎమ్మెల్యే గా గెలిచి దూకుడు మీద ఉన్నారు. కానీ అప్పటి నుండి ఒకే పార్టీలో కొనసాగకపోవడం ఒక్కటే ప్రతికూలత. 2007 లో కాంగ్రెస్ పార్టీ ద్వారా బరిలోకి దిగి విజయం సాధించారు.. అదే విధంగా 2012 ఎన్నికల లోనూ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే 2017 ఎన్నికల్లో మాత్రం ప్లేట్ ఫిరాయించారు. అప్పుడే దేశ వ్యాప్తంగా మోదీ సారథ్యంలో దూసుకు వచ్చిన బీజేపీ వలలో చిక్కుకున్నారు. అలా 10 సంవత్సరాల కాంగ్రెస్ బంధాన్ని అప్పటిలో తెగదెంపులు చేసుకుని బీజేపీ తరపున పోటీ చేసి గెలిచి సీఎంగా ఎంపికయ్యారు.

కాగా ఇప్పుడు బీజేపీ తరపున బరిలో ఉండగా కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, జనతాదళ్ లాంటి పార్టీలు ఎన్నికలో పోటీలో ఉన్నాయి. కానీ ఈ సారి సరికొత్తగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఓటర్లు ఓట్లు వేసేటప్పుడు బరిలో ఏ పార్టీ నేత ఉన్నాడు అన్న దానికంటే, నాయకుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని అంటున్నారు. బిజెపి ఒంటరిగా పోటీలో ఉంది. ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నా... గవర్నర్ కాంగ్రెస్ ను కాదని బీజేపీ కి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతిని ఇవ్వడంలో ఎంతటి రభస జరిగిందో తెలియంది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: