శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర: ఆ బీజేపీ నేత ఏమన్నారంటే?

Chakravarthi Kalyan
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర జరిగిందని.. ఈ హత్య కుట్ర కేసు నిందితులు ఢిల్లీలోని బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి ఇంట్లో ఆశ్రయం పొందారని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా వెల్లడించారు. ఈ హత్య కేసులో జితేందర్ రెడ్డి పాత్రపైనా విచారణ జరుపుతామని ప్రకటించారు.


దీంతో ఈ హత్య కుట్ర కేసుపై జితేందర్ రెడ్డి స్పందించారు. ఇది ఓ తప్పుడు కేసు అంటున్న జితేందర్ రెడ్డి ఈ కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్ చూసి జనం నవ్వుకుంటున్నారని జితేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. సామాజిక బాధ్యతగా ఆర్టీఐ ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుల్ని బయట పెట్టిన యువకులపైనే మంత్రి హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారని జితేందర్ రెడ్డి విమర్శించారు.


ఈ హత్యకు కుట్ర కేసు కేవలం రాజకీయ కుట్రతో పెట్టిన కేసు మాత్రమేనని జితేందర్ రెడ్డి అంటున్నారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. తెలంగాణ పోలీసులు చట్టాన్ని కాపాడుతారా? లేక టీఆర్ఎస్ అరాచకాలకు వంత పాడుతారా అని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. ఇప్పుడు ఏకంగా తన హత్యకు కుట్ర అని కేసులు పెట్టించారని.. ఆయన ఇంతగా క్షుద్ర రాజకీయాలకు దిగజారుతారని తాను ఊహించ లేదని జితేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.


ఈ కేసులో అసలు వాస్తవాలు అన్నీ త్వరలోనే బయటకు వస్తాయని జితేందర్ రెడ్డి అంటున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు ఏకంగా రూ. 15 కోట్ల రూపాయల సుపారీ గ్యాంగ్‌తో డీల్ మాట్లాడరని పోలీసులు చెబుతున్న విషయం సంచలనంగా మారింది. ఇది ఓ నేర సంఘటనగా కాకుండా.. రెండు పార్టీ మధ్య విషయంగా మారుతుందేమో అన్న సంకేతాలు కూడా అప్పుడే కనిపిస్తున్నాయి. చూడాలి.. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: