యూపీ : శక్తిమంత్రం ఫలిస్తుందా ?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఘట్టంలో కీలకం అనుకునే తుది రెండు దశల పోలింగ్ త్వరలోనే పూర్తి కానుంది.ఇవాళ ఆరో విడత పోలింగ్ జరగనుంది.అటుపై మార్చి ఏడున ఏడో విడత పోలింగ్ జరగనుంది.దీంతో పోలింగ్ ప్రక్రియ ముగిసినా ఫలితాలు తేలేంత వరకూ ఉత్కంఠ తప్పదు. మార్చి పదిన తుది ఫలితం తేలనుంది.ఉత్తర ప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాలలోనూ ఎన్నికలు జరిగాయి.
గోవా,ఉత్తరాఖండ్,మణిపూర్,పంజాబ్ రాష్ట్రాలలోనూ ఎన్నికలు జరిగాయి.వీటిలో పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల ఎన్నికలు పెద్దగా దేశాన్ని ప్రభావితం చేయవు కానీ కాస్తో కూస్తో ప్రధాన పార్టీల సత్తా ఏంటన్నది తేలిపోనుంది.ఇదే సమయంలో అతి పెద్ద రాష్ట్రం నాలుగు వందలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ భవితవ్యం తేలితే,అప్పుడు మోడీ ప్రభావం ఎంతన్నది స్పష్టం అయి ఉంటుంది. అందాక బీజేపీ శ్రేణులకు మానసిక ఒత్తిడి తప్పదు. ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ఆరో విడత పోలింగ్ జరగనుంది.మణిపూర్ లో రెండో విడత పోలింగ్ జరగనుంది.వీటిని సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో మోడీ ప్రభావం పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.కనుక ఆయనకు దీటుగా వచ్చే నాయకులు ఎవరు అన్నది ఆసక్తిదాయకంగా ఉంది.
రాహుల్, ప్రియాంక లాంటి రాజకీయ వారసులు ఎన్నికల ప్రచారంలో ఉన్నా కూడా మోడీని ఢీ కొనలేకపోయారు.సమర్థంగా బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టలేకపోయారు.ఇదే సందర్భంలో తాము ఇంతవరకూ వినిపించని హిందుత్వ నినాదాన్ని వినిపించి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.శక్తిమంత్రం పఠించారు.ఇవి వచ్చే కాలంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అన్నదే చర్చనీయాంశం.