తెలంగాణలో బీర్ల ధరలను పెంచేందుకు ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తుంది. గతంలో బీర్ల ధరలను కొంత తగ్గించి..మళ్లీ అదే స్థాయిలో పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలాఖరుతో మద్యం డిస్టలరీల రెన్యువల్ గడువు ముగుస్తుండటంతో, వాటిని రెన్యువల్ చేసి, ఆ తర్వాత బీర్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిస్టిలరీల నుంచి వివరాలను అధికారులకు పంపించారు. దీనిపై ఆబ్కారి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిస్టలరీల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని ఒక్కో బీరుపై 10 నుంచి 12 రూపాయల వరకు పెంచనున్నట్లు సమాచారం. ఆదాయ అన్వేషణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలను సవరించేందుకు కసరత్తు చేస్తోంది. మద్యం ధరలు నిర్ధారించే బాధ్యత
గతంలో మంత్రుల బృందానికి ఉండగా, ప్రస్తుతం అధికారుల కమిటీకి అప్పగించనున్నారు. గతేడాది డిసెంబర్ లో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మద్యం ధరలతో పోలిస్తే ఏపీలో ఎక్కువ ధరలు ఉండడంతో తెలంగాణలో కూడా లిక్కర్ ధరలను పెంచాలని భావిస్తున్నారు. కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత మద్యం ధరల పెంపునకు కసరత్తు చేసినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. ముందుగా వివిధ రకాల మద్యం ధరలను 5 నుంచి 10 శాతం మేరకు పెంచే ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. ప్రస్తుతం బీర్ల అమ్మకాలతో పోల్చితే వచ్చే వేసవి సీజన్లో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరగనున్నాయని అధికారుల అంచనా. ప్రతి వేసవిలో బీర్ల అమ్మకాలు రెట్టింపవుతూ వచ్చాయి. ఈసారి ప్రతి బీరు పై 10 రూ. చొప్పున పెంచాలని బడ్వయిజర్ కంపెనీ బీర్ల పై 12 వరకు పెంచాలని తయారీ కంపెనీలు ప్రాథమిక ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. బీర్ల తయారీ కంపెనీల రెన్యువల్ ప్రతి ఏటా మార్చి 31తో ముగుస్తుంది.
రెన్యువల్ సందర్భంగా కంపెనీలు ధరల పెంపు ప్రతిపాదనలను చేస్తాయి. అయితే నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే. ఈసారి బీర్ల కంపెనీలు కూడా ధర పెంచాలని ముందుగానే అధికారులకు ప్రతిపాదించాయి. దీనిపై ఆబ్కారి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా వ్యవహరిస్తున్న సోమేశ్ కుమార్, టీఎస్ బిసిఎల్ ఎండి సర్పరాజ్ అహ్మద్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మార్చిలో డిస్టలరీల రెన్యువల్ తర్వాత ధరల పెంపుపై నిర్ణయించి ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.