అది జరిగితేనే అసెంబ్లీకి.. నారా లోకేష్ డిమాండ్ ఏంటంటే..?

Deekshitha Reddy
రాజధాని అమరావతి విషయంలో వైసీపీకి పరాభవం ఎదురైందని అంటున్న టీడీపీ.. అసెంబ్లీ సమావేశాల్లో ఆ విషయాన్ని హైలెట్ చేయాలనుకుంటోంది. దానికి తోడు వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేది టీడీపీ ప్లాన్. అయితే అదే సమయంలో వారికి చంద్రబాబు చేసిన శపథం అడ్డుగా ఉంది. తిరిగి సీఎం అయిన తర్వాతే తాను సభలో అడుగు పెడతానంటూ గత అసెంబ్లీ సమావేశాలనుంచి వాకవుట్ చేశారు చంద్రబాబు. ఆయన వెంట ఎమ్మెల్యేలంతా బయటకు వెళ్లిపోయారు. బాబు మాటమీద మిగతావారు కూడా సమావేశాలకు దూరంగా ఉంటారని అనుకున్నారంతా. కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయాలు ఒకదాని వెంట ఒకటి జరిగాయని, వాటిని మిస్ చేసుకోకూడదనేది కొంతమంది వాదన.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 7 నుంచి మొద‌లు కాబోతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ స‌మావేశాలకు హాజరు కావాలా..? వ‌ద్దా? అనే విష‌యంపై టీడీపీలో పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. ఈ విషయంపై టీడీపీ పోలిట్ బ్యూరో అమ‌రావ‌తిలో భేటీ అయి సుదీర్ఘ చ‌ర్చ జ‌రిపింది. చంద్రబాబు సతీమణిపై సభలో మంత్రులు దారుణ వ్యాఖ్యలు చేశార‌ని, వారు బేష‌ర‌తుగా క్షమాప‌ణ‌లు చెప్పేదాకా అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లకూడదని టీడీపీ పొలిట్ బ్యూరోలోని మెజారిటీ స‌భ్యులు తమ అభిప్రాయం తెలిపారు. మంత్రులు క్షమాప‌ణ‌లు చెప్పని పక్షంలో ఎలాంటి వ్యూహం అవ‌లంబించాల‌నే దానిపై పొలిట్ బ్యూరోలో ఏకాభిప్రాయం రాలేదు. దీంతో దీన్ని టీడీపీఎల్పీకి బదలాయించారు.

లోకేష్ ఏమంటున్నారు..?
త‌న త‌ల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన‌ ఏపీ మంత్రులు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌ చెబితేనే అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల‌న్న పొలిట్ బ్యూరో నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని అంటున్నారు నారా లోకేష్. అయితే రాష్ట్ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కూడా టీడీపీ దృష్టిలో ఉంచుకుంటుందని ఆయన చెప్పారు. స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌భుత్వ వైఖ‌రిని నిల‌దీసేందుకు సమావేశాలకు వెళ్లాలనే ఉద్దేశం కూడా ఉందని అంటున్నారు. అయితే మంత్రుల క్షమాపణకే తాము కట్టుబడి ఉంటామని అంటున్నారు లోకేష్. ఈ విషయంలో టీడీఎల్పీ సమావేశంలో పార్టీ నాయకులు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: