పవన్ కి వ్యక్తిగత నష్టం.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు..

Deekshitha Reddy
త్రివిక్రమ్ ఏరికోరి పవన్ కల్యాణ్ కోసం ఈ డైలాగ్ రాశారో.. లేక ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి రాశారో తెలియదు కానీ.. భీమ్లా నాయక్ లో అహంకారానికి-ఆత్మగౌరవానికి మధ్య పోరాటం అనే డైలాగ్ సూపర్ హిట్ అయింది. దాన్ని జనసేన రాజకీయాలకు కూడా అన్వయిస్తోంది. అయితే ఈ పోరాటంలో జనసేనాని పవన్ కల్యాణ్‌ వ్యక్తిగతంగా చాలా నష్టపోయారంటున్నారు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్. అయినా కూడా పవన్ కల్యాణ్ పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు.

ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఆ సభలో పవన్ ఏం మాట్లాడతారో మీరే చూస్తారు కదా అంటూ చిన్న హింట్ వదిలారు నాదెండ్ల. భవిష్యత్తులో జేసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది పవన్ ఆవిర్భావ సభలో స్పష్టం చేస్తారని చెబుతున్నారు నాదెండ్ల. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని సభలో స్పష్టంగా చెబుతామన్నారాయన. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు తర్వాత జనసేన ఓ డిమాండ్ తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్ చేస్తోంది. సీఎం జగన్ నిర్ణయం వల్ల ఏపీ ప్రజలు ఇబ్బందులు పడ్డారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ అంటున్నా దానివల్ల ఎలాంటి ఫలితాలు అందలేదని, రెండేళ్లకు పైగా వికేంద్రీకరణ పేరుతో ఏం చేశారని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసినా ఫలితం లేదన్నారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శించారు.

ఇన్ని ఇబ్బందులు పెడతారా..?
మంగళగిరి నియోజవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ పెడతామనుకున్నామని చెప్పారు నాదెండ్ల. కానీ, సభ జరక్కుండా వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు. సభకోసం స్వచ్ఛందంగా స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు. నిండు మనస్సుతో సభ నిర్వహించుకోవడానికి స్థలం ఇస్తామన్న రైతుల్ని భయపెట్టి, వారితోనే స్థలం ఇవ్వలేమని చెప్పిస్తున్నారని అన్నారు. సభా వేదిక స్థలం వారం రోజుల్లో నాలుగు చోట్ల మారిందని, దానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనన్నారు. తమ సభలకు కూడా ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: