పంజాబ్ : సోనూసూద్ కి పెద్ద షాక్
తాజాగా జరిగిన ఎన్నికల్లో సోనూసూద్ కు జనాలు పెద్ద షాకే ఇచ్చారు. వాస్తవానికి సోనూసూద్ కు ఎన్నికలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధంలేదు. కానీ కాంగ్రెస్ తరపున పోటీచేసిన సోను చెల్లెలు మాళవికా సూద్ ఓడిపోయారు. పంజాబ్ లోకి మోగా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఆప్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. చెల్లెలు గెలుపుకోసం సోనూ ఎంత కష్టపడినా జనాలు మాత్రం ఇద్దరికీ పెద్ద షాకే ఇచ్చారు.
మాళవిక ఓడిపోవటంలో సోనూదే ప్రధాన పాత్రని చెప్పాలి. మాళవిక మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. అరంగేట్రం చేయటమే ఓడిపోయే పార్టీ తరపున అడుగుపెట్టడం సోను తప్పే. అంతర్గత వివాదాలతో గొడవలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు లేవని యావత్ దేశానికి తెలుసు. ఇదే సమయంలో ఆప్ వైపే జనాలు మొగ్గుచూపుతున్నట్లు అనేక సర్వేల్లో స్పష్టంగా తెలిసిపోయింది.
దేశం మొత్తానికి తెలిసిన ఈ విషయం పంజాబ్ వాసైన సోనూసూద్ కు ఎందుకు తెలీకుండా ఉంటుంది. పైగా ఆప్ లో చేరమని వచ్చిన ఆహ్వనాన్ని తిరస్కరించారు. అలాగే బీజేపీలో చేరమని పిలిస్తే కాదు పొమ్మన్నారు. వచ్చిన ఆహ్వనాలను కాదుపొమ్మని చివరకు ముణగిపోయే పడవలోకి ఎక్కించి తన చెల్లెల్ను కూడా ముంచేశారు. ఇక్కడ పోటీచేసింది మాళవికే అయినా మైనస్ సోనూ ఆమె జీరోయే. ఆమెకు పడిన కాసిని ఓట్లు కూడా సోనూను చూసే పడింది. ఆప్ తరపున తన చెల్లెలును పోటీచేయించుంటే ఈపాటికి సీన్ వేరేవిధంగా ఉండేదనటంలో సందేహంలేదు.
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్ళి తన సొంత ఇమేజితో చెల్లెల్ను గెలిపించుకోగలనని సోనూ అనుకునుంటారు. అయితే ఏటికి ఎదురీదితే ఏమవుతుందో సోనూకు ఫలితాలతో అర్ధమయ్యుంటుంది. అంటే జరిగింది చూస్తుంటే సోనుకు రాజకీయంగా పరిజ్ఞానం లేదా ? లేకపోతే తనను తాను చాలా ఎక్కువ అంచనా వేసుకున్నారా ? అన్నదే అర్ధం కావటంలేదు. ఏదేమైనా సోనూకి జనాలు పెద్ద షాకే ఇచ్చిందైతే వాస్తవం.