ఆవిర్భావ సభకోసం జనసైనికులకు పవన్ కీలక ఆదేశాలు..
మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభ ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్, నాగబాబు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సభ సందర్భంగా జనసైనికులను ఉద్దేశిస్తూ జనసేనాని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ పెట్టి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 9వ ఆవిర్భావ సభ జరుగుతోందని తెలిపారు. దామోదర సంజీవయ్య పేరుతో సభా స్థలికి నామకరణం చేసి ఈ సభ నిర్వహిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. సంజీవయ్య స్ఫూర్తితో సభా వేదికపై ప్రసంగిస్తానని అన్నారు పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ క్షేమాన్ని కోరుకునే ప్రతిఒక్కరూ జనసేన ఆవిర్భావ సభకు రావాలని పవన్ పిలుపు నిచ్చారు పవన్ కల్యాణ్. ఆవిర్భావ సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కూడా పవన్ తెలిపారు. అత్యంత జాగ్రత్తగా, అందరి సలహాలు తీసుకుని, మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సభకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన ఆవిర్భావ సభ ద్వారా దిశానిర్దేశం చేస్తానన్నారు. వైసీపీ పాలనలో గత రెండున్నరేళ్లలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపై సభలో ప్రసంగించబోతున్నట్టు పవన్ తెలిపారు. జనసైనికులందరూ సభకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు, అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆవిర్భావ సభకు వచ్చే మార్గం మధ్యలో ఎవరైనా ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని, అయితే సభకు వెళ్లడం తమ హక్కు అని అలాంటి వారందరికీ చెప్పాలని పవన్ సూచించారు.
పవన్ పదే పదే జాగ్రత్తలు సూచిస్తూ జనసైనికులకోసం ప్రకటన విడుదల చేశారు. సభకు వచ్చేవారంతా తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి ప్రమాదాలకు గురికావద్దని, అత్యుత్సాహంతో అజాగ్రత్తతో ఉండొద్దని చెప్పారు. జనసైనికుల క్షేమం గురించి తపించారు.