గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామ పరిధిలో ఈరోజు జనసేన ఆవిర్భావ సభ అనేది జరగనుంది.ఇక పార్టీని స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు, వీర మహిళలు ఇంకా రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని పవన్ తెలిపారు.ఇక భావి కార్యచరణఫై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా విస్పష్టమైన ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.జనసేన 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు ఇంకా బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ.. ఒక్క స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని రెడీ చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచే వ్యూహాలను రూపొందించుకోవాలని పార్టీ నాయకులు ఆలోచనలో ఉన్నారు.ఇక వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో కలిసి వెళ్లకుండా.. పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలు సూచించినట్లు సమాచారం తెలుస్తోంది. మరి ఈ రోజు జరగనున్న సభలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
గత మూడు సంవత్సరాలలో అధికార వైసీపీ సాగించిన అరాచకాలపై గళమెత్తడంతో పాటు ఫ్యూచర్ లో సర్కారుపై ఏ తరహాలో యుద్ధం కొనసాగించేదీ పవన్ కళ్యాణ్ వెల్లడించే అవకాశాలున్నాయి. ఇక వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారో ఈ సభ ద్వారా వివరిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే.. మెరుగైన భవిష్యత్ అందించగలం అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన మెసేజ్ ని పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సభకు వచ్చేవారిని ప్రభుత్వం బాగా ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. పవన్ ప్రసంగం మీద బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సైతం ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలిసింది.ఇక జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా స్పెషల్ సాంగ్ ని విడుదల చేశారు. భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ స్టైల్‌లో 'జన జన జన జనసేనా' అంటూ సాగే ఈ పాటకు జనసైనికులను ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలాగే మరోవైపు ఆవిర్భావ సభ సందర్భంగా ఇప్పటం గ్రామం వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడం వివాదానికి పెద్ద దారి తీసింది. ఇక విజయవాడతో పాటు గుంటూరు వెళ్లే వారధిపైనా స్వాగత బ్యానర్లు కూడా కట్టారు. వాటిని తాడేపల్లి పోలీసులు ఆదివారం నాడు తొలగించడంతో వివాదం చోటుచేసుకుంది.