కొరియాలో కరోనా బీభత్సం: ఒక్కరోజే 6 లక్షల కేసులు
కొవిడ్ మహమ్మారి దక్షిణ కొరియాపై విరుచుకుపడుతున్న తీరు భయం గొలుపుతోంది. ఈ దేశంలో కనిపించిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో విస్ఫోటంలా రోజువారీ కేసులు బయటపడుతున్నాయి. రికార్డు స్థాయిలో గురువారం ఒక్కరోజే అక్కడ 6,21,266 కేసులు నమోదైనట్టు ఆ దేశం తెలిపింది. ఇక్కడ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. మరణాలు కూడా అంతే.. 24 గంటల్లోనే 429 మంది కరోనాతో కన్నుమూశారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. 2 లక్షలకు పైగా కేసులు, 140 మరణాలు పెరిగినట్టు తెలుస్తోంది.
దక్షిణ కొరియాలో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య కోటికి చేరువు అవుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 82.50 లక్షలు దాటిపోయింది. దక్షిణ కొరియాలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 11,400గా ఉంది. దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వ్యాప్తి అత్యంత తీవ్ర దశకు చేరినట్టే. మొదట్లో టీకా తీసుకున్నవారికి ఒమిక్రాన్‌తో అంతగా ముప్పు ఉండదని అధికారులు అంచనా వేశారు. సీజనల్‌గా వచ్చిపోయే ఇన్‌ఫ్లుయాంజా కంటే ఇది ప్రమాదకరమైనది కాదని చెప్పారు.. డెల్టా వేరియంట్ లా ఒమిక్రాన్ ప్రమాదం కాదని కూడా అనుకున్నారు.
కానీ ఇప్పుడు సీన్ చూస్తే.. రివర్స్ అయ్యింది. అధికారులు ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయడం వల్లే ఈ స్థాయిలో కరోనా విజృంభిస్తోందంటున్నారు నిపుణులు. కరోనా తగ్గిందని భౌతికదూరం వంటి కొవిడ్ నిబంధనలను సడలించడం కూడా ఈ పరిస్థితికి కారణం అంటున్నారు.
దక్షిణ కొరియాలో ప్రస్తుతం కనిపిస్తున్నది ఒమిక్రాన్ లోని ‘బీఏ.2’ వేరియంట్ అని నిపుణులు చెబుతున్నారు.