ఆ రెండు పన్నులతో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత..

Deekshitha Reddy
జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఆయన్ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో గతంలో ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టని ప్రత్యేక పథకాలను జగన్ తెరపైకి తెచ్చారు. దాదాపుగా రాష్ట్రంలోని 70శాతం మంది ప్రజలు ఏదో ఒక లబ్ధి పొందేలా ఈ పథకాలను రూపొందించారు. కానీ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం పేదలను, లబ్ధిదారులను కూడా ముప్పతిప్పలు పెడుతున్నాయి. ముఖ్యంగా చెత్తపన్ను, పెరిగిన ఆస్తిపన్నుతో అందరూ సతమతం అవుతున్నారు.
ఇల్లు ఉండేవారే ఆస్తిపన్ను బాధితులు అనుకున్నా.. చెత్తపన్ను మాత్రం అందరిపై పడుతోంది. గతంలో చెత్తపన్ను విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించిన అధికారులు ఇప్పుడు మరోసారి జోరు పెంచారు. వసూళ్ల కోసం ప్రజలపై ఒత్తిడి పెంచుతూ వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. పన్ను చెల్లించని షాపుల ముందు చెత్త వేసి వెళ్లడం కొన్నిచోట్ల ఆందోళనలకు దారి తీస్తోంది. మరోవైపు ఆస్తిపన్ను చెల్లించని ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆస్తులు జప్తు చేస్తామని అంటూ బెదిరించడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.
ఈ నెలాఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.1,033.94 కోట్లు వసూలుచేసేలా అధికారులకు టార్గెట్ ఉంది. దీనికోసం వారు కిందిస్థాయి సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించారు. సచివాలయాల ఉద్యోగులు, వార్డు వాలంటీర్లను కూడా ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే లక్ష్యం మాత్రం సుదూరంగా ఉంది. ప్రజలనుంచి పెద్దగా స్పందన లేదు. ఆస్తిపన్ను విషయంలో స్పందన కనిపిస్తున్నా కూడా.. చెత్తపన్నుని మాత్రం అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గృహ సముదాయాల నుంచి నెలకు రూ.80-120 వరకు వసూలు చేయాలే ఆదేశాలున్నాయి. మురికివాడల్లో సైతం రూ.60 వసూలు చేయబోతున్నారు. షాపులు, హోటళ్లనుంచి మాత్రం భారీగా వసూలు చేస్తున్నారు. 200 రూపాయలనుంచి 15వేల రూపాయల వరకు వసూలు చేయబోతున్నారు. అంతంత భారీ పన్నులు చెల్లించలేమని చాలామంది ఇప్పటికే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోలేదు. ఇప్పటికే అధికారులకు మామూళ్ల రూపంలో సమర్పించుకోవాల్సి వస్తోందని, ఇప్పుడిక అధికారికంగా వేలకు వేలు చెత్తపన్ను చెల్లించాలంటే తమ వల్ల కాదంటున్నారు హోటళ్ల నిర్వాహకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: