చంద్రబాబుపై సీబీఐ విచారణ?

Chakravarthi Kalyan
మాజీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెగాసస్‌ను ఉపయోగించారని ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయటపెట్టిన విషయం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ నేపథ్యంలో చంద్రబాబుపై సీబీఐ విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఈ అంశంపై స్పందించారు.

చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అంటున్నారు. అంతే కాదు.. అసలు చంద్రబాబు నిజాయితీ పరుడైతే విచారణ జరపమని స్వయంగా ఆయనే కోరవచ్చు కదా అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అంటున్నారు. తాము గతంలోనే ఈ అంశంపై ఆరోపణలు చేశామని.. తమ ఫోన్లను ట్యాప్‌ చేశారని మంత్రి వెల్లంపల్లి గుర్తు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలో తాము చెప్పామని అంటున్నారు. తమ ఆరోపణల్లో నిజం ఉందని ఇప్పుడు తేలిపోయిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.
 
చంద్రబాబుకు ప్రజా క్షేత్రంలో నిలబడి పోరాడటం రాదని.. ఇలాంటి దొడ్డి దారుల్లోనే ఆయన పోరాడతారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. నేరుగా పోరాడలేక చంద్రబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. చంద్రబాబు హయాంలో  పెగాసస్‌ను ఉపయోగించడం ద్వారా రాష్ట్రానికే కాదు. దేశ రక్షణకు కూడా విఘాతం కలిగించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇకనైనా కేంద్రం చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇదంతా మీడియా ముందు మాట్లాడటానికేనా.. నిజంగానే వైసీపీ ఈ అంశంపై సీరియస్‌గానే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సీబీఐ విచారణకు కోరుతుందా అన్నది చూడాలి. అటు మోడీ సర్కారుకు కూడా చంద్రబాబును గ్రిప్‌లో ఉంచుకునేందుకు ఈ అంశం పనికొస్తుంది కదా అని ఆలోచించే అవకాశం లేకపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: