చైనా కొత్త వేవ్.. భారత్ ని చుట్టుముడుతుందా..?
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది కానీ, దానివల్ల వచ్చిన ముప్పు ఇంకా ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. యూరప్ తోపాటు దక్షిణాసియా దేశాల్లో కూడా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నట్టు పలు నివేదికల్లో తేటతెల్లమవుతోంది. ఒకవేళ ఈ కొత్త వేవ్ భారత్ ని కూడా తాకితే.. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే భారత్ విషయంలో అంత ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు. ఇప్పటికే భారత్ లో భారీస్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తయింది. చిన్నారులకు కూడా టీకాలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వైరస్ బారిన పడటంతో.. సహజంగా వచ్చే రోగనిరోధక శక్తి కూడా వారిలో ఉంది. అంటే ఇకపై కొత్త వేవ్ వచ్చినా మనకు పెద్దగా భయం లేదన్నమాట. ఈ అంశాల కారణంగా భారత్ లో ఈ కొత్త వేవ్ తీవ్ర ప్రభావం చూపలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్ లో కరోనా విస్తృతి తగ్గుతున్నప్పటికీ భవిష్యత్తులో వైరస్ లో మ్యుటేషన్లు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. చైనాలో కరోనా వైరస్ బయటపడినప్పటినుంచి ఇప్పటివరకు 1000 మ్యుటేషన్లు వచ్చాయని, కానీ వాటిలో 5 శాతం మాత్రమే ఆందోళనకరమైనవని అంటున్నారు. సహజంగా ఇన్ ఫెక్షన్ కు గురికావడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని, అది టీకా కంటే ఎక్కువ కాలం రక్షణ ఇస్తుందని అంటున్నారు. ఆ లెక్కన చూస్తే భారత్ లో టీకాతోపాటు, కరోనా వల్ల ఇబ్బందులు పడి సహజంగా రోగనిరోధక శక్తి కలిగి ఉన్నవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకే థర్డ్ వేవ్ మనపై పెద్దగా ప్రమాదం చూపలేదని అంటున్నారు. అంటే ఇకపై వచ్చే వేవ్ లు కూడా భారత్ లో ప్రభావం చూపించే అవకాశం లేదు. అదే సమయంలో చైనాలో కూడా వ్యాక్సిన్లు భారీగానే ఇచ్చారు. అక్కడ కూడా కొవిడ్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ ఇప్పుడు వైరస్ మరోసారి వారిని ఇబ్బంది పెడుతోంది. ఈలెక్కన చూసుకుంటే భారత్ కి ప్రమాదం లేదని చెప్పలేం. అలాగని అధైర్యపడకూడదని, కొవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ, మాస్క్ ధరిస్తూ స్వీయ రక్షణ పొందాలని చెబుతున్నారు నిపుణులు.