వార్నీ.. పాకిస్తాన్‌కు హైదరాబాద్ నుంచి డ్రగ్స్?
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలు పట్టుబడటం కొత్తేమీ కాదు.. కానీ.. ఏకంగా ఎగుమతి చేసే రేంజ్లో డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నారన్న విషయం పోలీసులను కూడా ఆశ్చర్యపరుస్తోది. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫార్మా కంపెనీలను అడ్డుపెట్టుకుని వాటిలో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉన్న లూసెంట్ డ్రగ్స్ అనే ఫార్మా కంపెనీలో ట్రెమడాల్ అనే మత్తుమందు తయారవుతోంది. అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది.
ఈ సంస్థలో తయారవుతున్న టెమడ్రాల్ ను ఎగుమతి చేసుకునేందుకు కూడా ఆ సంస్థకు అనుమతులు ఉన్నాయి. అయితే.. దాన్ని డెన్మార్క్, జర్మనీ, మలేసియాలకు ఎగుమతి చేసేందుకే పర్మిషన్ ఉంది. కానీ ఈ లూసెంట్ సంస్థ దొడ్డిదారిలో పాకిస్థాన్‌కు కూడా ఎగుమతి చేసినట్లు ఎన్సీబీ దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఈ టెమడ్రాన్ డ్రగ్స్ కాదు.. ఇది పెయిన్ కిల్లర్ లాంటిది. కానీ.. మత్తుబాబులు దీన్ని మత్తు కోసం కూడా వాడుతున్నారు. అంతే కాదు.. ఈ సంస్థకు ఔషధాల తయారీ కోసం ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ను వాడుకునేందుకు అనుమతి ఉంది.
కానీ.. ఈ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ను హెరాయిన్ తయారీకి కూడా వాడతారు. ఈ సంస్థ ఈ ఎసిటిక్ ఎన్ హైడ్రైడ్‌ను కూడా మాయం చేసింది. దీంతో ఈ డ్రగ్స్ దందాపై ఎన్సీబీ దృష్టి పెట్టింది. ఎన్సీబీ అధికారులు లూసెంట్ డ్రగ్స్ సంస్థ పై దాడి చేసి.. ఎండీ వినోద్‌జైన్, వైస్ ప్రెసిడెంట్ దేవరశెట్టి సాయి వికాస్, జనరల్ మేనేజర్ కరిమిశెట్టి భాస్కరరావులను అరెస్టు చేశారు.