అమరావతి : చంద్రబాబును ఎదుర్కోవాలంటే ఒకటే మార్గమా ?
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడును ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక మార్గం ఓటు. ప్రజల అభిమానాన్ని సంపాదించుకుని ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబును జగన్ ఓడించగలరు. ఇదికాకుండా మిగిలిన ఏ మార్గాల్లో అయినా చంద్రబాబును కట్టడి చేయాలని చూస్తే జగన్ వల్ల కాదనే చెప్పాలి. ఏ వ్యవస్ధ కూడా చంద్రబాబును ఏమీ చేయలేవని ఇప్పటికే చాలాసార్లు రుజువయ్యింది.
తాజాగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ఆరోపణలపై చంద్రబాబు మీద సభా సంఘం వేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇలాంటి సంఘాలు ఎన్నివేసినా ఎలాంటి ఉపయోగాలుండవు. ఎందుకంటే ఏదన్నా పనిచేసేముందే అందులోనుండి తప్పించుకునే మార్గాలను ఒకటికి పది రెడీగా పెట్టుకునే చంద్రబాబు దిగుతారు. అమరావతిలో భారీ ఎత్తున అనైతికంగా రియల్ ఎస్టేట్ వ్యవహారం జరిగిందని అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ఆ విషయాన్ని నిరూపించలేకపోతున్నారు.
చంద్రబాబు వ్యవహారాల మీద విచారణచేసి నిజాన్ని నిరూపిద్దామని ప్రభుత్వం అనుకున్నా సాధ్యం కావటంలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ విషయం తీసుకున్నా అడ్డంకులు వస్తునే ఉన్నాయి. కాబట్టి పెగాసస్ వ్యవహారంలో ఏదో జరిగిపోతుందనే భ్రమలు అవసరంలేదు. అందుకనే చంద్రబాబును గట్టిగా దెబ్బకొట్టాలని జగన్ అనుకుంటే అందుకు ఎన్నికలు ఒకటే మార్గం. నేరుగా ప్రజల మద్దతు సంపాదించి వైసీపీని గెలిపించుకోవటం ద్వారా మాత్రమే దెబ్బకొట్టగలరు.
స్ధానికసంస్ధల ఎన్నికలు, లోక్ సభ+అసెంబ్లీ ఉపఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఎలాగైతే టీడీపీని దెబ్బకొట్టారో అదే ఉత్తమమైన మార్గం. ఈ మార్గంలో చంద్రబాబు చేయగలిగిన మాయ ఏమీ ఉండదు. మహాఅయితే ఎల్లోమీడియాను ప్రయోగిస్తారంతే. జగన్ కు వ్యతిరేకంగా ఎల్లోమీడియా 24 గంటలూ పనిచేస్తునే ఉంది. ఈ విషయాన్ని జనాలు బాగానే గుర్తించారు. అందుకనే ఎల్లోమీడియాలో వచ్చే ఏ కథనాన్ని, వార్తను జనాలు పట్టించుకోవటంలేదు. కాబట్టి రేపటి ఎన్నికల్లో అయినా ఎల్లోమీడియా పరిస్ధితి ఇలాగే ఉంటుంది. అందుకనే మిగిలిన రెండేళ్ళు చంద్రబాబు గురించి జగన్ మరచిపోయి తనపనేదో తాను చూసుకోవటమే మంచిది.