రాయలసీమ : పొత్తులపై క్లారిటి వచ్చేసినట్లేనా ?

Vijaya




రాబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీ నుండి పొత్తుల విషయంలో క్లరిటి వచ్చేసినట్లే అనుకోవాలి. కర్నూలులో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు, జిల్లాల ఇన్చార్జిలందరు పాల్గొన్నారు. రాష్ట్ర ఇన్చార్జిలు సునీల్ ధియోథర్, మధుకర్ లు కూడా పాల్గొన్న సమావేశంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుండదని తేలిపోయిందట.





జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా పవన్ చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక, పొత్తులు, రోడ్డు మ్యాప్ తదితర అంశాలపైన సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అయితే సునీల్ మాట్లాడుతు టీడీపీతో పొత్తు విషయంలో అగ్రనేతలు ఏమాత్రం సుముఖంగా లేరని చెప్పేశారట. చంద్రబాబునాయుడుతో పొత్తు విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని సునీల్ అన్నారట. బీజేపీ ఆలోచించాల్సింది జనసేన గురించి మాత్రమే అని క్లారిటి ఇచ్చారట.





పొత్తుల విషయంలో పవన్ మనసులో ఏముందు స్పష్టంగా తెలియకపోయినా చంద్రబాబుతో పొత్తు  విషయంలో బీజేపీ అగ్రనేతలు మాత్రం చాలా క్లారిటితో ఉన్నట్లు సునీల్ చెప్పారట. అయితే పొత్తుల గురించి ఎన్నికలకు ముందు ఢిల్లీ నుండే ప్రకటన వస్తుందని కూడా అన్నారట. ఒకవేళ బీజేపీ  అగ్రనేతల ప్రకటనతో విభేదిస్తే ఏమి చేయాలనే విషయాన్ని పవనే నిర్ణయించుకోవాలి కానీ మనకేమీ సంబంధం లేదని సునీల్ చెప్పినట్లు సమాచారం.





కాబట్టి అనవసరమైన విషయాలపై ఇఫుడు చర్చించి ఎలాంటి ఉపయోగం లేదని పొత్తులనేవి తేలేది ఢిల్లీలోనే కానీ రాష్ట్రస్ధాయిలో కాదని కూడా చెప్పారట. అందుకనే పొత్తులపై ఎవరేమి మాట్లాడినా రెస్పాండ్ అవద్దని, తలోమాట మాట్లాడి క్యాడర్ ను అయోమయంలో పడేయద్దని చెప్పారట. పార్టీ ఒంటరిగా పోటీచేస్తేనే ఎదిగే అవకాశముందని కూడా కొందరు సూచించారట. అలాగే టీడీపీతో పొత్తు ఎట్టి పరిస్ధితుల్లోను వద్దని మెజారిటి నేతలు కుండబద్దలు కొట్టకుండానే చెప్పారట. సమావేశంలో చర్చలను, తీర్మానాలను అగ్రనేతల ముందుంచుతానని నిర్ణయం వాళ్ళే తీసుకుంటారని సునీల్ చెప్పారట. మొత్తంమీద టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ క్లారిటితోనే ఉన్నట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: