జొమాటో దిగొచ్చింది.. సంజాయిషీ ఇచ్చుకుంది..

Deekshitha Reddy
10నిముషాల్లో ఫుడ్ డెలివరీ అంటూ హడావిడి చేసిన జొమాటో చివరకు దిగొచ్చింది. కస్టమర్లకు, నెటిజన్లకు సంజాయిషీ ఇచ్చుకుంది. నగరాల్లో ట్రాఫిక్ జామ్ లతో ఇప్పటికే ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలా ఇబ్బందులు పడుతుంటారు. సకాలంలో ఫుడ్ డెలివరీ చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో జొమాటో ఇప్పుడు 10నిముషాల్లోనే డెలివరీ అనే ప్రకటన ఇచ్చింది. దీంతో చాలామంది ఆ సంస్థపై మండిపడుతున్నారు. 10నిముషాల్లో డెలివరీ అంటే డెలివరీ బాయ్స్ ఇబ్బందిని గమనించారా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. వారిపై ఎంత ఒత్తిడి ఉంటుంది, వారు ఏంకావాలంటూ నెటిజన్లు జొమాటోని ప్రశ్నించడంతో సదరు సంస్థ వివరణ ఇచ్చుకుంది.

కస్టమర్లు తమ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ఇటీవల జొమాటో కంపెనీ ప్రకటించింది. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే కాన్సెప్ట్‌ పై వివాదం చెలరేగింది, విమర్శలు వస్తున్నాయి. పలు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో తాము ఆ కాన్సెప్ట్  ఎందుకు తీసుకొచ్చాము, తమ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందనే విషయంపై జొమాటో యాజమాన్యం స్పందించింది. జొమాటో నిర్వాహకులు వివరణ ఇచ్చారు. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సర్వీస్ అందరికీ కాదని చెబుతున్నారు ఆ సంస్థ నిర్వాహకులు. సమీప ప్రాంతాల్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేవారి విషయంలోనే ఇది సాధ్యం అవుతుందని, దాన్ని దృష్టిలో పెట్టుకునే తాము ఆ ఆఫర్ ఇచ్చామని చెబుతున్నారు. అంతే కాదు, కొన్ని పాపులర్ ఐటమ్స్‌ ని మాత్రమే ఇలా 10నిముషాల్లో కస్టమర్లకు చేరవేస్తామంటున్నారు.

జొమాటో ఇచ్చిన 10 మినిట్స్ ఫుడ్ డెలివరీ ప్రకటనపై ఇటీవల సోషల్ మీడియాలో అదిరిపోయే మీమ్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ కావడంతో నెటిజన్లు జొమాటోని ఆటాడేసుకున్నారు. 10 నిమిషాల్లో డెలివరీ చేస్తే అది సేఫ్ గానే ఉంటుందా అని ప్రశ్నించారు. వంట వండి తీసుకొస్తారా.. లేక కూర‌గాయ‌లు తెచ్చి ఇచ్చి కస్టమర్లనే వండుకోమంటారా అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి వదిలారు. దీంతో జొమాటో చివరకు ఇలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 10 నిమిషాల ఫుడ్ డెలివరీపై తమ ఏజెంట్లకు ఇంతవరకు చెప్పలేదని కూడా నిర్వాహకులు అంటున్నారు. డెలివరీ ఏజెంట్ల భద్రత, ఆహార నాణ్యత వంటి విషయాల్లో జొమాటో రాజీ పడబోదని అంటున్నారు. గతంలో కొన్ని ఆన్ లైన్ షాపింగ్ సంస్థలు ఇలా గంట, 10నిముషాల ఆఫర్లు ప్రకటించాయి. అయితే ఇది ఆహార పదార్థాలకు వర్తింపజేస్తే మాత్రం కష్టం. అందుకే జొమాటో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: