గోదావరి : పవన్ వల్ల టీడీపీలో టెన్షన్ పెరిగిపోతోందా ?
పొత్తుల్లో జనసేనకు వచ్చే లాభం ఎంతో తెలీదుకానీ టీడీపీలో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీచేయబోయే నియోజకవర్గం ఇదే అని మరోసారి కాదు కాదు ఇంకోటని ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ పవన్ పోటీచేయబోయే నియోజకవర్గం ఏదో తెలీక తమ్ముళ్ళల్లో అయోమయం పెరిగిపోతోంది. దీనికి తగ్గట్లే చంద్రబాబునాయుడు కూడా చాలా నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను పెట్టలేదు. బహుశా పొత్తును దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇన్చార్జిలను నియమించటంలేదు. ఇదే చివరకు కొంప ముంచేస్తుందేమో అని తమ్ముళ్ళు కలవరపడుతున్నారు.
పవన్ పోటీచేయబోయే నియోజకవర్గాల జాబితా రోజు రోజుకు పెరిగిపోతోంది. ముందు తిరుపతన్నారు. తర్వాత కాకినాడ రూరల్ అన్నారు. ఆ తర్వాత కాకినాడ సిటీ అన్నారు. ఇపుడు పిఠాపురం అని కాదు కాదు అనకాపల్లంటున్నారు. మధ్యలో గాజువాకలోనే పవన్ పోటీచేస్తారన్నారు. మొన్నటి ఎన్నికల్లో తనను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ ను ఓడించేందుకు పవన్ మళ్ళీ భీమవరం నుండే పోటీచేయబోతున్నట్లు ప్రచారం అయ్యింది.
అసలిన్ని నియోజకవర్గాల పేర్లు ఎలా ప్రచారం జరుగుతోందో తెలీదు. జనసేన నేతల నుండే నియోజకవర్గాల పేర్లు లీకవుతున్నట్లు సమాచారం. చివరకు పవన్ ఎక్కడ నుండి పోటీచేస్తారో తెలీటంలేదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే పై నియోజకవర్గాల్లో టీడీపీకి మాజీలున్నారు. ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ బలంగానే ఉంది. అయితే పవన్ ఎక్కడినుండి పోటీచేస్తారో తెలీకపోవటం వల్ల తమ పరిస్ధితి ఏమిటో అర్ధంకాక తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి వీళ్ళ టెన్షన్ను పవన్ ఎప్పటికి తగ్గిస్తారో ఏమో.