అమరావతి : పవన్ పార్టీ పెట్టింది జగన్ కోసమేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని పవన్ చాలాసార్లే చెప్పుకున్నారు. కానీ ఆచరణలో అదంతా అబద్ధమే అని అర్ధమైపోతోంది. పవన్ పార్టీ పెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించటానికి మాత్రమే అని తెలిసిపోతోంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నపుడూ జగన్ను మాత్రమే పవన్ ప్రశ్నించేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ మాత్రమే పవన్ ప్రశ్నిస్తున్నారు.
పవన్ వైఖరితో ఎవరికైనా ఏమర్ధమవుతుంది ? కేవలం జగన్ను ప్రశ్నించేందుకు మాత్రమే పవన్ పార్టీ పెట్టారని. తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వంపై పవన్ మండిపోయారు. ఛార్జీలు పెంచినందుకు జగన్ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించటంలో తప్పేలేదు. కానీ ఇక్కడే ఒక విషయం దాగుంది. అదేమంటే సంవత్సరాల తరబడి పెరుగుతున్న పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల విషయంలో నరేంద్రమోడిని ఎందుకు పవన్ ప్రశ్నించటంలేదు.
నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా కేంద్రాన్ని పవన్ పల్లెత్తుమాట కూడా మాట్లాడటంలేదు. ఇదే సమయంలో తెలంగాణాలో కూడా కేసీయార్ విద్యుత్ ఛార్జీలను పెంచారు. మరి కేసీయార్ ను కూడా పవన్ ప్రశ్నించాలి కదా ? కేసీయార్ ను ప్రశ్నించేందుకు పవన్ నోరెందుకు లేవటంలేదు ? ఇంకో ఉదాహరణ చూస్తే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు విద్యుత్ ఛార్జీలను పెంచారు. మరపుడు కూడా చంద్రబాబును ఎందుకని ప్రశ్నించలేదో పవనే వివరణ ఇస్తే బాగుంటుంది.
అంటే పవన్ కు చంద్రబాబు అంటే మహా ముద్దు కాబట్టే ఏమి చేసినా మాట్లాడరు. నరేంద్రమోడి, కేసీయార్ అంటే భయం కాబట్టి వాళ్ళేంచేసినా పట్టించుకోరు. జగన్ అంటే మాత్రం మహామంట కాబట్టి ప్రతిదానికి జగన్ కు వార్నింగులిచ్చేస్తారు. డెడ్ లైన్లు పెడతారు, ప్రజా పోరాటాలంటారు, ప్రజా వ్యతిరేక పాలనంటు గోల మొదలుపెడతారు. జగన్ అంటే ఎందుకు మంట? ఎందుకంటే జనసేనను ఒక రాజకీయపార్టీగాను, పవన్ను రాజకీయ నాయకుడిగాను జగన్ అసలు లెక్కేచేయటం లేదు కాబట్టేనా ? దీంతోనే అర్ధమైపోతోంది పవన్ పార్టీ పెట్టింది జగన్ను ప్రశ్నించటానికి మాత్రమే అని.