అశోక్‌ గజపతిని అనూహ్యంగా కరుణించిన జగన్?

Chakravarthi Kalyan
టీడీపీ నేత అశోక్ గజపతి రాజును వైసీపీ సర్కారు ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలిసిన విషయమే.. ఆయన గజపతి రాజవంశస్తుడిగా.. అనేక దేవాలయాలకు అనువంశిక ఛైర్మన్‌గా ఉండేవారు.. అలాగే మాన్సాస్‌ ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉండేవారు.. ఈ మాన్సాస్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందల ఆలయాలు ఉన్నాయి. కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఎన్నో విద్యాసంస్థలు ఉన్నాయి. అయితే.. జగన్ అధికారంలోకి రాగానే అశోక్‌ గజపతిని మాన్సాస్ ట్రస్ట్‌ ఛైర్మన్ పదవి నుంచి తొలగించి.. ఆయన బంధువు సంచయిత గజపతి రాజును  మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమించారు.


ఈ విషయంపై అశోక్‌ గజపతి సుదీర్ఘ న్యాయ పోరాటమే చేశారు. చివరకు ఆయనే కోర్టులో గెలిచారు. జగన్ సర్కారు నియమించిన సంచయిత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అయితే.. ఇప్పుడు జగన్ ఎందుకో అశోక్‌ గజపతిరాజును అనూహ్యంగా కరుణించారు. అశోక్‌గజపతిరాజు అనువంశిక ఛైర్మన్‌గా... సింహాచలం ధర్మకర్తల మండలి ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం ధర్మకర్తల మండలి సభ్యులుగా 14 మందిని నియమిస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ధర్మకర్తల మండలి రెండేళ్లు ఉనికిలో ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం  తెలిపింది.


ఇంకా ఈ మండలిలో సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు కొనసాగుతారు. మండలి సభ్యులుగా సువ్వాడ శ్రీదేవి, పంచద్ది పద్మ, వంకాయల సాయి నిర్మల, దశమంతుల రామలక్ష్మి, ముదుండి రాజేశ్వరి, పెన్మత్స శ్రీదేవి వర్మ, బయ్యవరపు  రాధ, సంపంగి శ్రీనివాసరావు,  కృష్ణమూర్తి పాత్రుడు, దొడ్డి రమణ, గంట్ల శ్రీనుబాబు, రామొల్లి వీర వెంకట సతీష్, వారణాసి దినేష్ రాజ్, కూరాకుల నాగేశ్వరరావును నియమించారు. మండలికి ప్రత్యేక ఆహ్వానితులుగా మరో నలుగురికి అవకాశం కల్పించారు.


అయితే ఉన్నట్టుండి జగన్ సర్కారు ఎందుకు అశోక్‌ గజపతి రాజును కరుణించింది. ఈ పదవిలో మళ్లీ తిరిగి కూర్చోబెట్టింది.. ఇటీవల ఐఏఎస్‌లకు హైకోర్టు జైలు శిక్ష విధించిన ఘటన కారణంగాఈ పని జరిగిందా.. ఏమో లోగుట్టు పెరుమాళ్ల కెరుక?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: